Begin typing your search above and press return to search.

కాల్వ క్వ‌శ్చ‌న్‌!... బీసీల‌కు వైఎస్ ఏం చేశారు?

By:  Tupaki Desk   |   17 Oct 2017 7:41 AM GMT
కాల్వ క్వ‌శ్చ‌న్‌!...  బీసీల‌కు వైఎస్ ఏం చేశారు?
X
ఏపీ స‌మాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు.. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌కు సంబంధించి స‌ర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. రాష్ట్రంలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం బీసీల అభివృద్ధికి ఎంతో మేలు చేస్తోంద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. బీసీల గురించి మాట్లాడే ముందు ఆయ‌న త‌న తండ్రి వైఎస్ హ‌యాంలో బీసీల‌కు ఏం చేశారో చెప్పాల‌ని స‌వాల్ విసిరారు. విష‌యంలోకి వెళ్తే.. న‌వంబ‌రు 2 నుంచి `అన్న‌ వ‌స్తున్నాడు` పేరుతో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెల‌సిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న రాష్ట్రంలోని బీసీల‌ను ఎక్కువ‌గా టార్గెట్ చేస్తున్నారు. ప్ర‌స్తుత బాబు ప్ర‌భుత్వం బీసీల‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, వారికి స‌రైన ల‌బ్ధి కూడా చేర‌డం లేద‌ని జ‌గ‌న్ పేర్కొంటున్నారు. విజ‌య‌వాడ‌లో త‌న పార్టీ నేత‌ల‌తో భేటీ అయిన ఆయ‌న ఇదే విష‌యంపై చ‌ర్చించారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఇదే విష‌యం ప్ర‌చారం చేయాల‌ని ఆదేశించారు.

దీంతో రంగంలోకి దిగిన మంత్రి కాల్వ వైసీపీ అధినేత‌ జ‌గ‌న్‌ కు కౌంట‌ర్‌ గా మాట్లాడారు. త‌మ ప్ర‌భుత్వం బీసీల ప‌ట్ల ఎంతో బాధ్య‌త‌గా ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల వేళ హామీ ఇచ్చిన‌ట్లే బీసీల‌కు ప్ర‌త్యేక ఉప ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తోందని అన్నారు. జ‌గ‌న్‌కు తాను ఒక‌టే స‌వాల్ చేస్తున్నాని, జ‌గ‌న్‌ తండ్రి పాలించిన కాలంలో అవిభ‌క్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో బీసీల‌కు కేటాయిచింది ఎంతో, ఖ‌ర్చుపెట్టింది ఎంతో చెప్పాలని అన్నారు. అలాగే బీసీల అభివృద్ధి కోసం చేసిన కృషి ఏంటో తెలపాలని నిల‌దీశారు. ఈ విష‌యాల‌పై చ‌ర్చించ‌డానికి సిద్ధ‌మా? అని అన్నారు. టీడీపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు చేసిన దాంట్లో వైఎస్సార్ ప్ర‌భుత్వం సగమైనా చేయలేదని అన్నారు. జ‌గ‌న్ పార్టీ నేత‌లు వైఎస్సార్ పాల‌న మ‌ళ్లీ తీసుకొస్తామ‌ని చెప్పుకుంటున్నారని, అటువంటి పాల‌న ప్ర‌జ‌ల‌కు కావాలా? అని వ్యాఖ్యానించారు.

వైఎస్సార్ పాల‌న గురించి ప్ర‌తి బీసీ విద్యార్థికీ అర్థ‌మ‌య్యేలా చెబుతామ‌ని జగన్ అంటున్నార‌ని, మరి ‘వైఎస్సార్ పాల‌న‌లో బీసీలను రాజకీయంగా అణగదొక్కామని ప్ర‌జ‌ల‌కు చెబుతారా? వైఎస్సార్ బీసీల వ్య‌తిరేక‌మ‌ని చెబుతారా? ఆయ‌న పాల‌న‌లో బీసీ విద్యార్థులు ర‌క్తం అమ్ముకుని ఫీజులు క‌ట్టుకున్నార‌ని చెబుతారా?’ అని కాల్వ శ్రీనివాసులు ప్ర‌శ్నించారు. దీంతో కాల్వ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి. ఇక్క‌డే ఒక విష‌యం ఆస‌క్తిగా మారింది. జ‌గ‌న్ ఏ విష‌యం ఎంచుకున్నా, దేనిపై ఫైట్ చేయాల‌ని అనుకున్నా అధికార పార్టీ నేత‌లు - మంత్రులు.. జ‌గ‌న్‌ కు - ఆయ‌న తండ్రి వైఎస్‌ కు ముడిపెట్టి విమ‌ర్శ‌ల‌తో వాయించేస్తున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి పాద‌యాత్ర మొద‌ల‌య్యాక ఈ విమ‌ర్శల వేడి మ‌రెంత సెగ‌లు పుట్టిస్తుందో చూడాలి.