Begin typing your search above and press return to search.

అక్కడ కవిత 500 ఎకరాలు కొన్నారా?

By:  Tupaki Desk   |   27 Jan 2020 5:30 PM GMT
అక్కడ కవిత 500 ఎకరాలు కొన్నారా?
X
తెలంగాణ రాష్ట్రంలో అధికారపక్షంగా ఉన్న టీఆర్ ఎస్ కు రాజకీయంగా ఎదురులేకుండా పోతున్న పరిస్థితి. కాంగ్రెస్ నేతలు ఎంత మంది ఉన్నప్పటికీ గులాబీ కారు జోరును ఎవరూ నిలువరించలేకపోతున్నారు. తాజాగా వెల్లడైన పుర ఎన్నికల ఫలితాలు చూస్తే.. టీఆర్ ఎస్ జోరు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తమకు పెద్దగా బలం లేని మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లను సైతం సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాల్ని కొద్దిమంది కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటివేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యుల మీద కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తుర్కపల్లిలో 500 ఎకరాల్ని కొనుగోలు చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. తాను చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ పన్నెండుసార్లు యాదగిరి గుట్టకు వచ్చినా ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ లపై పరుష వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్.. కేటీఆర్ లు పశువుల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. అలాంటి వాళ్లను కాల్చి చంపినా తప్పు లేదన్నారు.

యాదగిరి గుట్టలో కాంగ్రెస్ కు ప్రజలు మెజార్టీ ఇచ్చారని.. అయినా దొడ్డిదారిన టీఆర్ ఎస్ మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. వరంగల్ కు చెందిన కడియం శ్రీహరితో ఎక్స్ అఫిషియో ద్వారా ఓటు ఎలా వేయిస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి హాట్ వ్యాఖ్యలకు కేసీఆర్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిగిలిన ఆరోపణలు ఎలా ఉన్నా..కవిత మీద ఆయన చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపిస్తే రాజకీయం మరింత వేడెక్కేదిగా కోమటిరెడ్డి సాబ్?