Begin typing your search above and press return to search.

ఆ పాపం కాంగ్రెస్‌ దే.. బాబు తప్పేమీ లేదు: ఎంపీ కవిత

By:  Tupaki Desk   |   19 Dec 2018 3:22 PM GMT
ఆ పాపం కాంగ్రెస్‌ దే.. బాబు తప్పేమీ లేదు: ఎంపీ కవిత
X
తెలంగాణ ఎన్నికల్లో తనతో పాటు కాంగ్రెస్ పార్టీని గోదాట్లో తోసిన చంద్రబాబు చెవికి అప్పటి నుంచి తిట్లు - శాపనార్థాలు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. కానీ, ఈ రోజు ఆయనకు ఊహించని వ్యక్తి నుంచి సానుభూతి దొరికింది. అవును... ఏ కేసీఆర్‌ కు వ్యతిరేకంగా అయితే చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో తెగకష్టపడ్డారో అదే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇప్పుడు చంద్రబాబుకు నాలుగు సాంత్వన వచనాలు పలికారు. తెలంగాణలో కూటమి ఓటమికి చంద్రబాబు కారణం కాదని.. ఇందులో ఆయన తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. దీంతో అటు కాంగ్రెస్ - ఇటు టీడీపీ రెండు పార్టీలూ షాకయ్యాయట. ఒకవైపు తండ్రి కేసీఆర్ తనను తిడుతూ రిటర్ను గిఫ్టులివ్వడానికి ఏపీకి ఎన్నికల టైంలో వస్తానంటూ బెదిరిస్తుండగా.. కూతురు మాత్రం చంద్రబాబుపై సాఫ్ట్ కార్నర్ చూపించడానికి కారణం ఏమిటి అని రాజకీయ వర్గాలు ఆలోచిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ అనకుంటున్న తరుణంలో అవసరమైతే చంద్రబాబును కలుపుకోవాల్సిన రోజు రావొచ్చన్న ఉద్దేశంతో ఓ వైపు కవితతో వ్యూహాత్మకంగానే సాఫ్ట్ కామెంట్లు చేయిస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది.

దిల్లీలో ఈ రోజు టీఆర్ ఎస్ ఎంపీలంతా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత కూడా మాట్లాడారు. “తెలంగాణలో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఓటమికి చంద్రబాబే కారణం అని చెప్పడం విడ్డూరంగా ఉంది. నిన్న మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు పొత్తు వల్ల ఓడిపోయాం అని అంటున్నారు. కూటమి ఓటమి పట్ల చంద్రబాబు తప్పేమి లేదు. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసినప్పుడే కాంగ్రెస్ ఓడిపోయింది. అసెంబ్లీ రద్దు తర్వాతే కూటమి కట్టారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘కాంగ్రెస్ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక కుంటి సాకులు చెబుతున్నారు. కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదు. టిఆర్ ఎస్ ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తుందని పట్టం కట్టారు. ఈవీఎంల లొల్లి పెట్టుకుంటే ఒక రాష్ట్రం చూసుకుంటే మూడు రాష్ట్రాల్లో ఇబ్బందులు వస్తాయని ఈవీఎంల పై మాట్లాడొద్దని కాంగ్రెస్ హైకమాండ్ టిపిసిసిని హెచ్చరించింది. ఇక చేసేదేం లేక కాంగ్రెస్ నేతలు చంద్రబాబు మీదకు తమ ఓటమిని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ఓటమికి చంద్రబాబుకు సంబంధం లేదు.” అని కవిత అన్నారు.