Begin typing your search above and press return to search.

ఏపీ బీఆర్ఎస్ బాధ్యతలు కల్వకుంట్ల కవితకే.. మతలబేంటి?

By:  Tupaki Desk   |   15 Jan 2023 1:30 AM GMT
ఏపీ బీఆర్ఎస్ బాధ్యతలు కల్వకుంట్ల కవితకే.. మతలబేంటి?
X
ఏపీలో విస్తరణబాట పట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు అక్కడ అధ్యక్షుడిని.. కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఏపీలో బహిరంగ సభకు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 19న ఖమ్మం సభ ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీ బీఆర్ఎస్ నేతలకు ఆహ్వానం అందింది. ఏపీలో చేరికలు, సభ నిర్వహణతోపాటుగా విస్తరణ కార్యచరణపైన ఎమ్మెల్సీ కవిత ఫోకస్ పెట్టారు.

ఏపీ బీఆర్ఎస్ బాధ్యతలు తీసుకున్న కవిత.. ఈ నెలాఖరులో ఏపీలో పర్యటించనున్నారు. ఏపీ బీఆర్ఎస్ సమన్వయకర్తగా కవితకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఏపీ బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం.

తాజాగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తోపాటు రావెల కిషోర్ బాబు, పార్థసారథి తాజాగా కవితతో భేటి అయ్యారు. ఏపీలో పార్టీలో చేరికలు.. విస్తరణ దిశగా తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. మరికొంత మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్లు బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ నేతలు కవితకు వివరించారు. ప్రస్తుతం పార్టీ నేతలంతా ఖమ్మం సభపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో అధ్యక్షుడు కేసీఆర్ పర్యటనలు ఉండనున్నాయి. బడ్జెట్ సమావేశాల తర్వాత పూర్తిస్థాయిలో పర్యటనలకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.

ఈనెల 29న కవిత ఏపీలో పర్యటించే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ఏపీకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ సమక్షంలోనే పార్టీలో చేరాలని భావిస్తున్నారని ఏపీ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

ఏపీలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య రాజకీయం కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ విస్తరణ బాధ్యతలను కవిత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ముందుగా చేరికలు, రాష్ట్ర కమిటీల నియామకం పూర్తి చేయాలని భావిస్తున్నారు. పార్టీలోకి వచ్చే వారికి గుర్తింపు దక్కేలా కమిటీల్లో స్థానం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

ప్రస్తుతం ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉన్నాయి. ఆ పార్టీలతోపాటుగా బీజేపీని వ్యతిరేకించే వారికి బీఆర్ఎస్ వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది. యాంటీ బీజేపీ పాలిటిక్స్ ను కేసీఆర్ చేయనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.