Begin typing your search above and press return to search.

తనలోని మరో యాంగిల్ చూపించిన కవిత

By:  Tupaki Desk   |   20 Oct 2019 4:58 AM GMT
తనలోని మరో యాంగిల్ చూపించిన కవిత
X
అన్ని వేళల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ రావు. కొన్ని సందర్భాల్లో అవకాశాల్ని వెతుక్కోవాలి కూడా. సార్వత్రిక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె హోదాలో నిజామాబాద్ ఎంపీ స్థానం బరిలోకి దిగి ఓటమి మూట కట్టుకున్న తర్వాత నుంచి కవిత.. తన హడావుడిని కాస్త తగ్గించారని చెప్పాలి. ప్రజల నుంచి అనూహ్య రీతిలో తిరస్కరణ ఎదురుకావటం ఆమెకు ఒక పట్టాన మింగుడుపడలేదని చెబుతారు.

ఓవైపు తన తండ్రి.. తన సోదరుడు చెలరేగిపోతున్నట్లుగా.. ఎన్నికల్లో దూసుకెళితే.. తాను మాత్రం ఓటమితో చతికిలపడిన వైనంపై ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు చెబుతారు. ఈ కారణంతోనే ఈ ఏడాది బతుకమ్మ విషయంలో ఆమె అంత యాక్టివ్ గా ఉండలేదంటారు. కుమార్తె మనసు బాగోనప్పుడు ఏ తండ్రి సైతం హుషారు ఉంటారు చెప్పండి. ఈ కారణంతోనే గతంలో మాదిరి బతుకమ్మ విషయంలో సీఎం ఉత్సాహాన్ని ప్రదర్శించలేదన్న విమర్శ ఒకటి వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. తనను వెతుక్కుంటూ వచ్చిన రెండు అంశాల విషయంలో కవిత తనదైన శైలిలో రియాక్ట్ కావటమే కాదు.. సోషల్ మీడియాలో తాను చేసిన పనిని చెప్పుకోవటం ద్వారా కొత్త తరహా ఇమేజ్ బిల్డింగ్ కు తెర తీశారని చెప్పాలి. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చేర్చుకోలేదు. మధ్యతరగతికి చెందిన వ్యక్తి చికిత్సకు అయ్యే ఖర్చును భరించే స్థోమత అతనికి లేదు.

ఇలాంటివేళ.. ఈ విషయం గురించి అవగాహన ఉన్న సురేశ్ అనే నెటిజన్.. సదరు వ్యక్తి వివరాల్ని.. బాధితుడి ఫోటో.. ఆధార్ కార్డును కలిపి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన కవిత సానుకూలంగా స్పందించటమే కాదు.. తమ ఆఫీసు ఫోన్ నెంబరును పోస్ట్ చేసి.. ఫోన్ చేస్తే సాయం అందిస్తారంటూ భరోసా ఇచ్చారు. ఈ ఘటనలోనే కాదు..మరో బాలికకు సైతం సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ చిన్నారికి తమ కార్యాలయ సిబ్బందితో సాయం అందించారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన ట్వీట్లు చేయటం ద్వారా చేసిన పనిని నలుగురికి చెప్పుకోవటం ద్వారా.. అక్కా మీరు సూపర్.. మీ మంచి మనసుకు థ్యాంక్స్.. ఇలా ఆకాశానికి ఎత్తేసే ప్రచార కార్యక్రమానికి కవిత షురూ చేశారని చెప్పక తప్పదు.