Begin typing your search above and press return to search.

మలేషియా వేదికగా తమిళ రాజకీయం

By:  Tupaki Desk   |   6 Jan 2018 2:39 PM GMT
మలేషియా వేదికగా తమిళ రాజకీయం
X
తమిళ సినిమాలకు మలేషియాతో ఒక తెలియని అనుబంధం ఉంది. ఆ మాటకొస్తే మొత్తం తమిళనాడుకే మలేషియాతో ఒక అప్రకటిత సంబంధం ఉంటుంది. మలేషియాలో తమిళులు నెలకొల్పుకున్న అతి భారీ మురుగన్ విగ్రహం ఉన్న ఆలయం కూడా ఎంత ఖ్యాతిగాంచిందో అందరికీ తెలుసు. ఆ రకగా తమిళనాడుతో అనేక రకాలుగా దగ్గరగా ఉండే మలేషియా.. ఇప్పుడు తమిళ రాజకీయాల కీలక భేటీకి కూడా వేదిక అవుతోదిం.

అవును మరి- తమిళ రాజకీయ యవనికపై కొత్త నాయకులుగా ఆవిర్భవించబోతున్న రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ ప్రస్తుతం మలేషియాలో ఉన్నారు. తమిళ సినీనటుల సంఘం ‘నడిగర్ సంఘం’ వారు మలేషియా లో నిర్వహిస్తున్న స్టార్ నైట్ కార్యక్రమానికి ఈ ఇద్దరు ప్రముఖులూ హాజరయ్యారు. ఈ ఇద్దరూ ఇప్పటికే తమ తమ రాజకీయ ప్రస్థానం గురించి ప్రకటించి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

కమల్ హాసన్ తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. అప్పటినుంచి అధికార పార్టీల మీద నిశితమైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. టీటీవీ దినకరన్ మీద ఘాటైన విమర్శలతో తాజాగా తమిళ వార్తల్లో వ్యక్తిగానే ఉన్నారు.

అదే సమయంలో డిసెంబరు 31న తాను కూడా పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించిన రజనీకాంత్.. అప్పటినుంచి పార్టీ వెబ్ సైట్.. అభిమానుల నమోదు వంటి కార్యక్రమాలతో దూసుకెళుతున్నారే తప్ప.. ఇంకా ఉన్న పార్టీలను విమర్శించడం వంటి క్రియాశీలరాజకీయం జోలికి వెళ్లలేదు. కాకపోతే.. తన తొలి అడుగుకు ముందస్తు ప్రిపరేషన్ లాగా.. దీవెనలకోసం అంటూ కరుణానిధిని మాత్రం కలిశారు.

ఇలాంటి నేపథ్యంలో ఈ ఇద్దరు స్టార్ నాయకులు తమ తమ పార్టీల ప్రకటన తర్వాత తొలిసారిగా కలిసిన సందర్భానికి మలేషియా వేదిక అయింది. స్టార్ నైట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత.. ఈ ఇద్దరూ ప్రత్యేకంగా విడిగా భేటీ కాబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలో తమ తమ పార్టీల ద్వారా రాజకీయ భవిష్య ప్రస్థానానికి సంబంధించిన స్కెచ్ రూపొందించుకుంటారని అంతా అనుకుంటున్నారు. ఈ ఇద్దరూ పొత్తులు పెట్టుకుని బరిలోకి వస్తారనే ఊహ ఎవ్వరిలోనూ లేదు గానీ.. కనీసం.. తమ వరకు ఒకరినొకరు విమర్శించుకోకుండా.. ముందుకు సాగే పార్టీలుగా వారు మాట్లాడుకోవచ్చుననే ఊహాగానాలు నడుస్తున్నాయి.