Begin typing your search above and press return to search.

కశ్మీర్ గాయం పై కారం చల్లిన కమల్ హాసన్

By:  Tupaki Desk   |   18 Feb 2019 4:44 PM GMT
కశ్మీర్ గాయం పై కారం చల్లిన కమల్ హాసన్
X
దక్షిణాది నటులు కొద్దికాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువవుతున్నారు. రాజకీయ ఉద్దేశాలతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకునే అనేక చర్యలను ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్తోందంటే జాతి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపైనా కొందరు నటులు - ఇతరులు కూడా రాజకీయం చేస్తున్నారు. ఉగ్రవాదులు మన సైనికులను పొట్టన పెట్టుకుంటుంటే.... పాకిస్తాన్‌ ను మోదీ చర్చలకు పిలవకపోవడం వల్లే అని కొందరు... నిరుద్యోగం వల్లే ఉగ్రవాదులు తయారవుతున్నారని మరికొందరు ... అసలు కశ్మీర్‌ లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి వారు పాకిస్తాన్ లో కలుస్తామంటే కలిపేయమని మరికొందరు.. ఇలా ఎవరికి తోచిన కామెంట్లు వారు ఇష్టారాజ్యంగా చేసేస్తున్నారు.

తాజాగా నటుడు - మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా కశ్మీర్లో ప్లెబి సైట్ ఎందుకు పెట్టరు అంటూ ప్రశ్నించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘‘కశ్మీర్‌ లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అవకాశం ఇవ్వాలి. ప్రజాభిప్రాయం సేకరించేందుకు ఎందుకు భయపడుతున్నారు?’’ అని కేంద్రాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. దీంతో కమల్ వ్యాఖ్యలపై దుమారం మొదలైంది.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లో రైళ్లలో జీహాదీలను హీరోలుగా చూపిస్తూ వాళ్ల ఫొటోలు ప్రదర్శిస్తున్నారని.. భారత్ కూడా ఇలాంటి బుద్ధి హీనమైన పనులే చేస్తోందంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ మంచి దేశమని నిరూపించుకోవాలి. కశ్మీర్‌పై రాస్తున్నప్పుడే ఇలాంటి జరుగుతాయని తాను ముందే ఊహించానని ఆయన అన్నారు.. రెండు దేశాల్లోని నాయకులు సరిగా ప్రవర్తిస్తే సైనికులు ఇలా చనిపోయే పరిస్థితి ఉండదని చెప్పారు. మయ్యం మ్యాగజైన్ రాస్తున్నప్పుడు.. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు ఏం జరగబోతోందో కూడా రాశాను. ఇదంతా నేను ముందే ఊహించానని కమల్ అన్నారు. కమల్ హాసన్ మాటలపై గొడవ మొదలవడంతో పార్టీ నుంచి ఒక ప్రకటన విడుదలచేశారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని.. కమల్ తాను ఎప్పుడో రాసిన వ్యాసం గురించి మాట్లాడితే దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా వివాదం చేస్తున్నారని పార్టీ తరఫున ప్రకటన విడుదల చేశారు.