Begin typing your search above and press return to search.

మూడో కూటమి దిశగా లోకనాయకుడు!

By:  Tupaki Desk   |   10 Nov 2017 5:19 PM GMT
మూడో కూటమి దిశగా లోకనాయకుడు!
X
కమల్ హాసన్ రాజకీయంగా ఇంకా తన తొలి అడుగు వేయలేదు. అయితే దానికి సంబంధించిన కసరత్తు మాత్రం గట్టిగానే చేస్తున్నారు. లోకల్ గా తాను పార్టీ ప్రారంభించేలోగా, తొలిసారిగా గళమెత్తి తన వాదన ఏమిటో తెలియజెప్పేలోగా.. ప్రజల వాస్తవ సమస్యలను తెలుసుకోవడానికి ఆయన ఓ యాప్ ను ప్రారంభించారు. కాకపోతే.. యాప్ ల రూపంలో యూత్ ఓరియెంటెడ్ సమస్యలు మాత్రమే ఆయన దృష్టికి వస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.... ఇది లోకల్ గా పార్టీ వ్యవస్థకు సంబంధించిన వైనం. అలాగే జాతీయ స్థాయిలో.. రాజకీయ శక్తుల సమీకరణ దిశగా కూడా కమల్ తనను తాను యాక్టివ్ గా తీర్చుకుంటున్నాడా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. భాజపాకు మాత్రం అనుకూలంగా ఉండబోనని ముందే సంకేతాలు ఇచ్చిన ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ ... జాతీయ స్థాయిలో.. మూడో ప్రత్యామ్నాయానికి మద్దతిచ్చే తమిళ నేతగా గుర్తింపుకోసం పాకులాడుతున్నట్లు గా ఉంది.

కోల్ కతలో పశ్చిమబెంగాల్ సీఎం, మమతా బెనర్జీని కమల్ కలుసుకున్నారు. ఓ ఫిలిం ఫెస్టివల్ కోసం కోల్ కత వెళ్లిన ఆయన ఆమెతో విడిగా భేటీ అయ్యారు. అయితే తాను కేవలం మర్యాదపూర్వకంగా కలిశాననే మాట ఇదివరకటి రోజుల్లో అయితే జనం నమ్మేవారేమో. కానీ ఇప్పుడు మాత్రం కమల్ అలాగే చెబుతున్నా.. మూడో ప్రత్యామ్నాయం గురించిన కసరత్తులో ఆయన భాగమైనట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు.

కమల్ రాజకీయంగా ఇప్పటికీ తొలి అడుగు వేయకపోవచ్చు. కానీ ఆయన మీద నమ్మకంతో తమిళ ప్రజలు తమ సమస్యలను నివేదించుకోవడం ప్రారంభం అయిపోయింది. అలాగే.. ఆయన తొలి అడుగుకు ముందే.. జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక శక్తుల సమీకరణలో ఆయన భాగం అయిపోతున్నారు. తమిళనాడులో ఉన్న రాజకీయాల నేపథ్యంలో- తానుగా ఎటూ భాజపాను వ్యతిరేకిస్తున్న కమల్... ఎటూ కాంగ్రెస్ తో మాత్రం జత కట్టలేరు. అలాంటప్పుడు జాతీయ రాజకీయాల జట్టు గురించి ఆలోచిస్తే ఆయనకు మూడో కూటమి ఒక్కటే దిక్కవుతుంది. అందుకే ఇప్పటినుంచే మోడీ వ్యతిరేక కూటమికి పెద్దదిక్కు అయిన మమతా దీదీ ఆశీస్సులతో ప్రొసీడ్ అవుతున్నారని అంతా భావిస్తున్నారు.