Begin typing your search above and press return to search.

'ఆ హామీలన్నీ మావే .. కాపీ కొట్టారు' : డీఎంకే పై కమల్ ఫైర్ !

By:  Tupaki Desk   |   8 March 2021 4:30 PM GMT
ఆ హామీలన్నీ మావే .. కాపీ కొట్టారు : డీఎంకే పై కమల్ ఫైర్ !
X
తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని ప్రధాన పార్టీలు కూడా విజయమే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించడానికి వరాల జల్లు కురిపిస్తున్నాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పరిస్థితి రోజురోజుకి మరింత వేడెక్కిస్తుంది. ఈ నేపథ్యంలో మక్కల్ నీది మయ్యం నేత కమల్ హసన్ డీఎంకే పై , డీఎంకే అధినేత స్టాలిన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలను డీఎంకే నేతలు కాపీ కొట్టారని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హసన్ ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో తాము గెలిచి అధికారంలోకి వస్తే ప్రతి నెలా రాష్ట్రంలో మహిళలకు వెయ్యి రూపాయల ఆర్ధిక సహాయం చేస్తామని డీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. తమిళనాడు అభివృద్డికి 10 ఏళ్ళ విజన్ డాక్యుమెంటును ఈ పార్టీ చీఫ్ స్టాలిన్ నిన్న విడుదల చేసిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కుటుంబంలో పెద్దగా ఉన్న మహిళలకు ప్రతి నెలా వెయ్యి రూపాయల ఆర్ధిక సాయం చేస్తామని, దీనివల్ల వారు ప్రజా పంపిణీ వ్యవస్థల నుంచి నిత్యావసరాలను కొనుగోలు చేసుకోగలుగుతారని ఆయన అన్నారు. అయితే స్టాలిన్ తమ హామీలను కాపీ కొట్టారని కమల్ హసన్ దుయ్యబట్టారు. ఇది అసలు మా ఐడియా… ఈ విధమైన హామీలను మేము మొదటే మా మేనిఫెస్టోలో ఇచ్చామన్నారు. బీజింగ్ డిక్లరేషన్ ఆధారంగా మేం ఈ హామీని ఇచ్చామన్నారాయన.

ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తాము వాగ్దానం చేశామని, ఇప్పుడు స్టాలిన్ ఏడాదికి 10 లక్షల జాబ్స్ ఇస్తామని హామీ ఇస్తున్నారని ఆయన చెప్పారు. ఐదేళ్లలో 50 లక్షలు, ఏడాదికి 10 లక్షలు ఉద్యోగాలు.. రెండూ ఒకటే కదా అని కమల్ హసన్ ఫైర్ అయ్యారు. ఇలా ఉండగా తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కుదరడం. బీజేపీకి 20 సీట్లు ఇచ్చేందుకు అన్నా డీఎంకే అంగీకరించడం, అటు డీఎంకే, కాంగ్రెస్ మధ్య కూడా పొత్తు కుదరడం తెలిసిందే. ప్రచార హోరు రాబోయే రోజుల్లో మరింత వేడిని పుట్టించబోతుంది.