Begin typing your search above and press return to search.

తమిళనాడు ఫలితాలపై కమల్ ప్రభావం గట్టిగానే?

By:  Tupaki Desk   |   12 March 2019 8:21 AM GMT
తమిళనాడు ఫలితాలపై కమల్ ప్రభావం గట్టిగానే?
X
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాట రాజకీయ వేడి రసవత్తరంగా మారింది. రాజకీయ దిగ్గజాలు జయలలిత - కరుణానిధి దివంగతులు కావడంతో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ పార్టీ గెలుస్తుందనే విషయం పక్కన పెడతే సినీరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కమల్‌ హాసన్‌ పై అందరి దృష్టి మళ్లింది. సినీరంగంలో ఓ వెలుగు వెలిగిన కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.. ఆయనే సొంతంగా ఎంఎన్‌ ఎం (మక్కల్‌ నీది మయ్యం) పార్టీని 2018 ఫిబ్రవరి 22వ తేదీన స్థాపించారు.

అయితే పార్టీ పెట్టి ఏడాది దాటినా.. పెద్దగా కార్యక్రమాలు ఏమీ చేయలేదు. కాగా రానున్న సార్వత్రిక సమరంలోకి దిగేందుకు కమల్‌ సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. కమల్‌ తో పాటే రాజకీయ అరంగేట్రానికి సిద్ధమైన మరో నటుడు రజనీకాంత్‌.. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు తొలుత ప్రకటించాడు.. కానీ తర్వాత పోటీలో ఉండటం లేదని స్పష్టం చేశారు. కాగా ఎన్నికల సంఘం కమల్‌ పార్టీకి టార్చిలైట్‌ ను పార్టీ గుర్తుగా కేటాయించింది. ఫలితంగా వచ్చే 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో తమిళనా ఏ పార్టీ అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తుందో అనేది చర్చనీయంగా మారింది.

ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నా డీఎంకే - ప్రతిపక్షంలోని డీఎంకే పార్టీలతో తమిళ తంబిలు విసిగెత్తిపోయారు. ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. ఇన్నాళ్లూ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉండటంతో మిగతా పార్టీలు ఈ రెండింటికే మద్దతు ఇచ్చేవి. అయితే ఈసారి సినీరంగంలో తనదైన ముద్ర వేసుకున్న కమల్‌హాసన్‌ రాజకీయ అరంగేట్రం చేస్తుండటంతో పరిస్థితులు మార్పును కోరుకుంటాయా? లేక యథావిధిగా ఆ రెండు పార్టీల వైపే ఓటర్లు మొగ్గు చూపుతారా? అనేది ఆసక్తికరం.

తమిళ రాజకీయాలను శాసించిన జయలలిత - కరుణానిధి మరణించారు. అనంతరం తమిళనాడులో రాజకీయంగా ఎన్నో మార్పులు జరిగాయి. అధికారం కోసం వెంపర్లాట - ఆధిపత్య పోరు తదితర అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో కమల్‌హాసన్‌ తమిళ రాజకీయాల్లో రావడం సరైన సమయమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల్లో తన అభిమానులు ఏ మేరకు గెలిపిస్తారో వేచి చూడాలి.

తమిళనాట డీఎంకే - అన్నా డీఎంకే మధ్య ప్రధాన పోటీ ఉండగా ప్రస్తుతం కమల్‌ హాసన్‌ పార్టీ బరిలోకి వస్తుండటంతో త్రిముఖ పోరు నెలకొంది. కాగా కమల్‌ ఏ మేరకు ప్రభావం చూపిస్తాడనేది అభ్యర్థుల ఎంపిక ఆధారంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రజనీ నేరుగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో దూకుదామని అనుకుంటుంటే కమల్‌ మాత్రం ఇప్పుడే ఒక రాయి వేసేందుకు సిద్ధమయ్యాడు. పార్టీ పెట్టిన తర్వాత మౌనం వహిస్తే రాజకీయంగా ఎదగడం కష్టమని కమల్‌ ఎట్టకేలకు సమరానికి సన్నద్ధమయ్యారు.

దీంతో కమల్‌ రాకతో తమిళనాట పోరు త్రిముఖంగా మారనుంది. మరి లోక నాయకుడు ఏమేరకు సత్తా చూపిస్తాడన్నది ఆసక్తికరం. కమల్‌ పార్టీ తరఫున అభ్యర్థులు నిలిస్తే రజనీకాంత్‌ పరోక్షంగా మద్దతు ప్రకటిస్తారని సమాచారం. కాగా, రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కమల్‌ హాసన్‌ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ, అన్నాడీఎంకేలతో తొలి నుంచి విబేధిస్తూ వస్తున్న కమల్‌ కాంగ్రెస్‌ దిశగా అడుగులు వేశారు. కమల్‌తో జత కలిసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సైతం సానుకూలంగా స్పందించింది.

ఈ నేపథ్యంలోనే తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు అళగిరి.. కమల్‌ తో చర్చలు జరిపారు. అయితే ఇటీవల కాంగ్రెస్ - డీఎంకేలు కూటమిగా బరిలో దిగనున్నట్టు ప్రకటించాయి. అందులోని డీఎంకేతో కమల్‌కు పొసగకపోవడంతో ఆ కూటమిలో చేరే అవకాశం లేకుండాపోయింది.