Begin typing your search above and press return to search.

ఓటుకు నోటివ్వడంట.. చంద్రబాబు హీరో అంట!

By:  Tupaki Desk   |   23 Feb 2018 11:06 PM IST
ఓటుకు నోటివ్వడంట.. చంద్రబాబు హీరో అంట!
X
ఎక్కడో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవతల ఉన్న తెలంగాణలో - ఎప్పుడో రెండేళ్ల కిందట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ‘ఓటుకు నోటు’ అంటూ ఒక యవ్వారం బయటపడితే.. అది మన తమిళ సోదరులకు ఇంకా గుర్తుంటుందా? అని బహుశా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్ సరైన అవగాహన లేక - అనుకుని ఉండొచ్చు. కానీ.. రాజకీయాల్లో దేశవ్యాప్త ఇమేజి ఉన్న నారా చంద్రబాబునాయుడు కు సంబంధించిన వ్యవహారం అయ్యేసరికి ప్రజలు చాలా శ్రద్ధగా తెలుసుకుని ఉండే అవకాశం ఉందని ఆయన అనుకోలేదేమో పాపం.

కమల్ హాసన్ రాజకీయాల్లో కొత్త విలువలు స్థాపించడానికి తాను పార్టీ పెట్టిన రేంజిలో ఇప్పుడు అనేక రకాల నీతులు చెబుతున్నారు. ఇదే నాయకుడు తన పార్టీని ప్రకటించిన వేదిక మీదినుంచి ఓటుకు ఆరువేల రూపాయలు ఇచ్చే స్తోమత తనకు లేదని.. ఓట్లను డబ్బిచ్చి కొనుగోలు చేయడం అనే సంస్కృతిని దూరం చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని సెలవిచ్చారు. కానీ సాధారణంగా పార్టీని స్థాపించిన తొలిరోజు ప్రసంగంలో నాయకుడి నుంచి ఇంకా ఏదో ఆశిస్తారు.

సాధారణంగా నాయకులు చేస్తున్న తప్పులు ఏంటి.. ఆ తప్పులను తాను ఎలా చక్కదిద్దబోతున్నాడు.. లాంటివి చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ.. చూడబోతే.. ఎన్నికల వ్యవస్థకు సంబంధించి.. ప్రజలు చేస్తున్న తప్పులేంటి.. వాటిని తాను సంస్కరించేస్తాను అని కమల్ వెల్లడించినట్లుగా వ్యవహారం తయారైంది.

ఓట్లకు డబ్బు తీసుకునే విషయంలో ప్రజలకు హితబోధ చేస్తున్నారు కమల్. డబ్బు తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని అమ్మేయడమే అని అంటున్నారు. నిజమే కానీ.. ఇలాంటి నీతులు ప్రవచించే నాయకుడు.. ‘నా రాజకీయ హీరో చంద్రబాబునాయుడు’ అని ఎలా అనగలిగాడు అనే మౌలికమైన సందేహం ప్రజలకు కలుగుతోంది. పైగా ఆ చెప్పడం కూడా ఆషామాషీగా చెప్పలేదు. ఒకవైపు అంబేద్కర్ - ఒకవైపు అబ్దుల్ కలాం - ఒకవైపు మహాత్మాగాంధీ లను ప్రస్తావిస్తూ రాజకీయంగా తన హీరో చంద్రబాబునాయుడు అని కమల్ చెప్పేసరికి అంతా తుస్సుమనిపోయింది.

చంద్రబాబునాయుడు స్వయంగా ఓటుకు నోటు కాదుకదా.. కోట్లు ఇవ్వజూపిన కేసులో నిందితుడిగా కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి. వచ్చే ఎన్నికల నాటికి ఒక్కో నియోజకవర్గానికి పాతిక కోట్ల వంతున అందరికీ పార్టీనే పంపిణీ చేసేలా డబ్బు పోగేసి పెట్టాడనే ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్న వ్యక్తి. అలాంటి చంద్రబాబును హీరో అని పేర్కొనడం.. నాయకుడిగా ఎన్ని నీతులు చెప్పినా.. కమల్ కు మైనస్ పాయింట్ అవుతుందని ఆయన తెలుసుకోవాలి.