Begin typing your search above and press return to search.

'మీటూ' పై 'భార‌తీయుడి' రియాక్ష‌న్!

By:  Tupaki Desk   |   12 Oct 2018 3:58 PM GMT
మీటూ పై భార‌తీయుడి రియాక్ష‌న్!
X
ప్ర‌స్తుతం దేశంలో `#మీటూ ఇండియా` ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగ‌సిన సంగ‌తి తెలిసిందే. సినీ రంగం మొద‌లుకొని...రాజ‌కీయ రంగం వ‌ర‌కు ప్ర‌తి రంగంలో ప్ర‌ముఖ వ్య‌క్తుల‌పై ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ బాధితులు ముందుకు రావ‌డం సంచ‌ల‌నం రేపింది. ఈ క్ర‌మంలోనే బాధితుల‌కు మ‌ద్ద‌తుగా చాలామంది త‌మ గ‌ళం వినిపిస్తున్నారు. ప్ర‌ముఖ త‌మిళ ర‌చ‌యిత వైర‌ముత్తుపై చిన్మ‌యి చేసిన ఆరోప‌ణ‌లు కోలీవుడ్ లో క‌ల‌క‌లం రేపాయి. ఆ ఆరోప‌ణ‌ల‌ను వైర‌ముత్తు ఖండించ‌గా....చిన్మయి - ఆమె త‌ల్లి ప‌ద్మిని ధృవీక‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ వివాదంపై - మీటూ ఉద్య‌మంపై విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స్పందించారు. మహిళలు తమపై జ‌రిగిన వేధింపులు - త‌మ‌కు జ‌రిగిన‌ అ‍న్యాయం గురించి నిజాయితీగా - న్యాయంగా చెప్పాలని కమల్ అన్నారు. అయితే, మీటూకు సంబంధం లేని వ్యక్తులు త‌మ‌ అభిప్రాయాలను వెల్ల‌డించ‌డం వ‌ల్ల ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని క‌మల్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఏ రంగంలో నైనా మ‌హిళ‌ల‌పై వేధింపులు స‌రికాద‌ని - వాటికి ఖండించాల‌ని క‌మ‌ల్ అన్నారు. మహిళలు నిజాయితీగా త‌మ‌కు క‌లిగిన ఇబ్బందుల గురించి చెబితే అర్థవంతమైన న్యాయం దొరుకుతుందని క‌మ‌ల్ అన్నారు. కానీ, ఆ ఘ‌ట‌న‌ల‌పై సంబంధిత బాధితులు మాత్రమే అభిప్రాయం చెప్పాల‌ని - ఆ ఘ‌ట‌న‌ల‌కు ఏమాత్రం సంబంధం లేని వారు వాటిపై స్పందించ‌డం స‌రికాద‌న్నారు. మీటూ ఉద్యమాన్ని తాను స్వాగతిస్తున్నానని - స‌మాజంలో కొత్త మార్పున‌కు ఈ ఉద్య‌మం నాంది ప‌లుకుతుంద‌న్నారు. మ‌రోవైపు - మీటూ ఉద్య‌మంలో వ‌చ్చిన ఫిర్యాదుల‌కు సంబంధించి కేంద్రం ...నలుగురు స‌భ్యుల‌తో క‌మిటీని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సీనియ‌ర్ జ‌డ్జిలు - న్యాయ నిపుణులు ఆ క‌మిటీలో స‌భ్యులుగా ఉంటార‌ని కేంద్ర శిశు మ‌హిళా సంక్షేమాభివృద్ధి శాఖా మంత్రి మేన‌కా గాంధీ తెలిపిన సంగ‌తి తెలిసిందే.