Begin typing your search above and press return to search.

ప్లీజ్‌.. కాలాను అడ్డుకోవ‌ద్దు -క‌మ‌ల్‌

By:  Tupaki Desk   |   6 Jun 2018 1:45 PM GMT
ప్లీజ్‌.. కాలాను అడ్డుకోవ‌ద్దు -క‌మ‌ల్‌
X
క‌ర్ణాట‌క - త‌మిళ‌నాడుల మ‌ధ్య కావేరీ జ‌లాల వివాదం ఈనాటిది కాదు. కేంద్రం ఉదాసీన‌త‌, ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల నేప‌థ్యంలో ఈ స‌మ‌స్య అలా కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో కావేరి జ‌లాల గురించి త‌మిళ‌నాడుకు అనుకూలంగా మాట్లాడాడ‌ని సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన‌ కాలా చిత్రాన్ని క‌ర్ణాట‌క‌లో నిషేధం విధిస్తూ కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్ నిర్ణ‌యం తీసుకుంది.

అయితే కాలా చిత్రాన్ని విడుద‌ల కాకుండా అడ్డుకోవ‌ద్ద‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామికి హీరో ర‌జ‌నీకాంత్ విజ్ఞ‌ప్తి చేశారు. అదే స‌మ‌యంలో కాలా సినిమా గురించి త‌న‌ను అడ‌గొద్ద‌ని కుమార‌స్వామి అన్నారు. అయితే ర‌జ‌నీకాంత్ కు మాత్రం చిత్ర‌వ‌ర్గాల నుండి ఈ విష‌యంలో మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. కావేరి జ‌లాల విష‌యంలో వ్యాఖ్య‌ల‌పై ర‌జ‌నీతో విభేదించిన న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సినిమా విడుద‌లను అడ్డుకోవ‌ద్ద‌ని ర‌జ‌నీకి మ‌ద్ద‌తుగా మాట్లాడారు.

రాజకీయంగా ర‌జ‌నీతో విభేధాలు ఉన్నా సినిమాల ప‌రంగా మేమంతా ఒక్క‌టేన‌ని, క‌ర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సమస్యను తీర్చేందుకు కృషి చేయాలని క‌మ‌ల్ హాస‌న్ విజ్ఞ‌ప్తి చేశాడు. త‌న విశ్వ‌రూపం సినిమాను కూడా క‌ర్ణాట‌క‌లో నిషేధించిన విష‌యాన్ని ఈ సంధ‌ర్భంగా గుర్తు చేశారు. కాలా సినిమా కోసం ర‌జ‌నీ అభిమానులు వేచిచూస్తున్నార‌ని, అన్ని స‌మ‌స్య‌ల మాదిరిగానే ఈ స‌మ‌స్య‌ను సంబంధిత బోర్డు, శాఖ చ‌ర్చించి ప‌రిష్క‌రించాల‌ని క‌మ‌ల్ కోరాడు.

ఇదే స‌మ‌యంలో మూవీ విడుదలను అడ్డుకోలేమని హైకోర్టు తీర్పునిచ్చినా, సినిమా విడుద‌ల‌తో మ‌రిన్ని వివాదాలు త‌లెత్తుతాయ‌ని భావిస్తున్నందున కొన్ని రోజులు వేచిచూడాల‌ని కుమార‌స్వామి ఆలోచ‌న‌గా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో త‌మ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని కించ‌ప‌రిచేలా దృశ్యాలు ఉన్నాయ‌ని, ఖ‌చ్చితంగా చిత్రాన్ని అడ్డుకుంటామ‌ని నాడార్ సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంది. ఈ పరిస్థితుల‌లో క‌ర్ణాట‌క‌లో కాలా భ‌విష్య‌త్ ఏంటో రేప‌టితో తేల‌ననుంది.