Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సీఎం ప‌ద‌వి ఊడ‌బీకుతున్న సొంత పార్టీ యువ‌నేత‌?

By:  Tupaki Desk   |   9 March 2020 4:02 PM GMT
కాంగ్రెస్ సీఎం ప‌ద‌వి ఊడ‌బీకుతున్న సొంత పార్టీ యువ‌నేత‌?
X
కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ లో రాజకీయాలు ఊహించ‌ని మలుపు తిరుగుతున్నాయి. తమ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో భాగంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు హర్యానాలోని ఓ హోటల్‌ కు తరలించారని కాంగ్రెస్‌ ఆరోపించడంతో మొదలైన కలకలం స‌ద్దుమ‌ణుగుతోంద‌ని అనుకుంటున్న త‌రుణంలోనే...ఆరుగురు కేబినెట్ మంత్రులతో పాటు 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక‌స్మాత్తుగా బెంగ‌ళూరులో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. కాంగ్రెస్ స‌ర్కారును దింపేందుకు బీజేపీ ఎత్తుగ‌డ అని కొంద‌రు, అంత‌ర్గ‌త కుమ్ములాటలే ఈ ప‌రిస్థితికి కార‌ణ‌మ‌ని మ‌రికొంద‌రు ఈ పరిణామాన్ని విశ్లేషిస్తున్నారు.

230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 114 - బీజేపీకు 107 మంది ఎమ్మెల్యేలున్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కనీస మెజారిటీ 116 కాగా నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు - ఒక ఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌ సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన బీఎస్పీ ఎమ్మెల్యేను బీజేపీ నేతలు ఢిల్లీకి తీసుకెళ్లారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్ గ‌త‌వారం ఆరోపించగా ఆ త‌ర్వాత వారు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. అయితే, తాజాగా 18 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆరుగురు మంత్రులు రెబెల్స్‌ గా మారి భోపాల్ నుంచి మూడు ప్రత్యేక చార్డెట్ ఫ్లైట్‌ లో బెంగళూరుకు చేరుకున్నారు. దీంతో క‌మ‌ల్‌ నాథ్ స‌ర్కారుపై కాంగ్రెస్‌ లో క‌ల‌వ‌రం మొద‌లైంది.

కాగా, ఈ ఎత్తుగ‌డ‌ల‌పై అప్పుడే వ్యూహాలు మొద‌ల‌య్యాయి. మెజార్టీ ఎమ్మెల్యేలు క‌మ‌ల్‌ నాథ్‌ కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ప్రతిపక్ష బీజేపీ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, ఈ పరిణామంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ముఖ్యమంత్రి కమల్‌ నాథ్ - కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స‌హా ఇత‌ర ముఖ్య‌నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం సీఎం క‌మ‌ల్‌ నాథ్ మాట్లాడుతూ సోనియా త‌మ‌కు వ్యూహ‌ర‌చ‌న చేశార‌ని వెల్ల‌డించారు. ఇదిలాఉండ‌గా, కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా సార‌థ్యంలోనే అస‌మ్మ‌తి వ‌ర్గం ఎత్తుగ‌డ‌లు జ‌రుగుతున్నాయ‌ని ప‌లువురు అంటున్నారు. 18 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఈయన వర్గం వారే కావడం, రాష్ట్రంలో ఇంత జ‌రుగుతున్నా ఆయన రాజధాని ఢిల్లీలోనే ఉండిపోవ‌డం దీనికి ఆజ్యం పోస్తోంది.