Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ స‌ర్కారు మ‌నుగ‌డ‌ను కాపాడ‌నున్న క‌రోనా?

By:  Tupaki Desk   |   15 March 2020 7:49 AM GMT
కాంగ్రెస్ స‌ర్కారు మ‌నుగ‌డ‌ను కాపాడ‌నున్న క‌రోనా?
X
మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ లో ముస‌లం పుట్టిన సంగ‌తి తెలిసిందే. జ్యోతిరాధిత్య సింధియాతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు తిరుగుబాటు చేశారు. సింధియా వెళ్లిపోయి ఉంటే కాంగ్రెస్ కు త‌క్ష‌ణ న‌ష్టంఏమీ ఉండేది కాదేమో. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపుతోనే అస‌లు న‌ష్టం జ‌రుగుతున్న‌ట్టుగా ఉంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుతో క‌మ‌ల్ నాథ్ ప్ర‌భుత్వం కుప్ప‌కూలే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఎప్పుడు విశ్వాస‌ప‌రీక్ష జ‌రిగినా అక్క‌డ ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డం లాంఛ‌న‌మే కావొచ్చు. అయితే ఇప్పుడు రాజ‌కీయంలో స్వ‌ల్ప మ‌లుపు చోటు చేసుకునే ప‌రిస్థితి ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వం ప‌డిపోవాలంటే.. అసెంబ్లీ స‌మావేశం జ‌ర‌గాలి, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితేనే ప్ర‌భుత్వం ప‌డిపోతుంది.

మామూలుగా అయితే మార్చి ప‌ద‌హారు సోమ‌వారం నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గాల్సి ఉంది. ఈ స‌మావేశాల్లోనే అవిశ్వాస తీర్మానాన్ని కూడా బీజేపీ ప్ర‌వేశ పెట్టే అవ‌కాశాలున్నాయి. అయితే.. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశాలు లేన‌ట్టుగా తెలుస్తోంది.

దీంతో ప్ర‌భుత్వ మ‌నుగ‌డ మ‌రి కొన్నాళ్ల పాటు కొన‌సాగే అవ‌కాశాలు లేక‌పోలేదు. అసెంబ్లీ స‌మావేశం అయ్యేంత వ‌ర‌కూ ప్ర‌భుత్వ మ‌నుగ‌డ‌కు ఇబ్బంది లేక‌పోవ‌చ్చు. ఒక‌వేళ అంత‌గా గ‌వ‌ర్న‌ర్ బ‌ల నిరూప‌ణ చేసుకోవాల‌ని ముఖ్య‌మంత్రిని ఆదేశించినా, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అసెంబ్లీని స‌మావేశ ప‌రిచేందుకు అవ‌కాశం లేద‌ని స‌మాచారం ఇవ్వ‌వ‌చ్చు! ఇలా ప‌రిమిత కాలం కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కొన‌సాగ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డిన‌ట్టుగా ఉంది.