Begin typing your search above and press return to search.

మామా...మరీ అంత ఆవేశమా...?

By:  Tupaki Desk   |   2 Nov 2022 10:30 AM GMT
మామా...మరీ అంత ఆవేశమా...?
X
ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి స్వయంగా మేనమామ. వైఎస్ విజయమ్మకు ఆయన సోదరుడు. కడప జిల్లా కమలాపురం శాసనసభ్యుడు. రెండు తడవలుగా అక్కడ నుంచి గెలిచి వస్తున్నారు. మేనల్లుడి ప్రభుత్వంలో మామకు మంత్రి పదవి దక్కలేదు కానీ కడప జిల్లాలో ఆయన హవాకు తిరుగులేదని చెబుతారు.

ఇదిలా ఉంటే ఎపుడూ తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉండే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అలా ఎందుకు జరిగింది అంటే ఆయన గారి ఆవేశమే దానికి కారణం అని చెప్పాలి. తన సొంత నియోజకవర్గంలో రవీంద్రనాధ్ రెడ్డి నాయకులతో ఏదో విషయం మీద సీరియస్ గా ఉండగా బాధితుడు ఒకరు ఏదో విషయం మీద ఆయనను అర్ధించినట్లుగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తే అర్ధమవుతుంది.

అయితే ఆయన ఏమడిగారో తెలియదు కానీ వీరావేశంతో రవీంద్రనాధ్ రెడ్డి ఆయన మీద చేయి చేసుకోవడం మాత్రం వీడియో కెమెరా ఠక్కున క్యాచ్ చేసి పారేసింది. అంతే ఏపీ అంతా అదిపుడు గిర్రున తిరిగేస్తోంది. గడప గడపకు వెళ్ళి ప్రజలకు అందుతున్న సదుపాయాల గురించి తెలుసుకోమని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

అభివృద్ధి ఫలాలు అందని వారు ఉంటే వారు అర్హులు అయి ఉంటే వాటిని అందించేలా చూడమని కూడా సీఎం ఆదేశించారు. సరే గడప గడపకు కార్యక్రమాన్ని కొంతమంది సీరియస్ గా తీసుకుని చేస్తున్నారు. మరికొంతమంది అయితే బే ఫికర్ గా ఉన్నారు. దాని మీద జగన్ ఎప్పటికపుడు వర్క్ షాప్స్ పెట్టి నేతలకు చెప్పాల్సింద్ది చెబుతున్నారు.

అది వేరే విషయం కానీ. సొంత మేనల్లుడు కమ్ సీఎం అయిన జగన్ మాటను మేనమామ అయిన రవీంద్రనాధ్ రెడ్డే పట్టించుకోకపోతే ఎలా అన్నదే ప్రశ్న. ఎమ్మెల్యేలు అన్న తరువాత చాలా మంది బాధిత జనాలు వస్తారు, సమస్యలు చెప్పుకుంటారు. తమకు సత్వర పరిష్కారం కావాలని కూడా ఆశిస్తారు. కొన్ని సందర్భాల్లో విసిగిస్తారు కూడా.

అంతమాత్రం చేత వారిని కసురుకోవడం చేయి చేసుకోవడం ఏంటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది. రవీంద్రనాధ్ రెడ్డి వీరావేశం మొత్తం వీడియో కెమరీ ఫోకస్ చేశాక ఇక ఆయన దీనికి ఏమని బదులిస్తారు అన్నది కూడా చర్చగా ఉంది మరి. నీకేమి పని లేదా అంటూ ఎమ్మెల్యే గారు అలా చేయి చేసుకోవడం మాత్రం విమర్శలకు తావు ఇచ్చేలా ఉంది. మొత్తానికి సొంత మేనమామ ప్రజల మీద ఇలా విరుచుకుపడడాన్ని చిర్రెత్తిపోవడాన్ని చూసి జగన్ ఏమంటారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.