Begin typing your search above and press return to search.

నమ్మినవాడే ముంచాడా? కామారెడ్డి తల్లీ కుమారుల విషాదం వెనుక అసలు కథ?

By:  Tupaki Desk   |   16 April 2022 4:30 PM GMT
నమ్మినవాడే ముంచాడా? కామారెడ్డి తల్లీ కుమారుల విషాదం వెనుక అసలు కథ?
X
కామరెడ్డి జిల్లాలో ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో శనివారం తెల్లవారుజామున పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో లాడ్జి సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా డీఎస్పీ సోమనాథం, సీఐ నరేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గదిలో రెండు మృతదేహాలు లభించగా, అవి తల్లీ కుమారులవని, వారు మెదక్ జిల్లాకు చెందిన వారని గుర్తించారు. అయితే వీరి మరణం తెలిసిన మృతుల కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రాథమిక దర్యాప్తు మేరకు వీరి ఆత్మహత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా చనిపోయే ముందు మృతుల్లో ఒకరు వీడియో తీసి ఆత్మహత్యకు కారణాలు వెల్లడించడంతో వీరి మరణం వెనుక షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన పద్మ ఆమె కుమారుడు సంతోష్ కామారెడ్డి లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సంతోష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. తనపై కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసులు ఓ ఫేస్ బుక్ పోస్టు విషయమే ఒత్తిడి తెచ్చారని, ఈ వేధింపులు తట్టుకోలేకే తల్లి కుమారులు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈనెల 11న తల్లితో కామారెడ్డి చేరుకున్న సంతోష్ స్థానికంగా ఉన్న శ్రీ కాళభైరవస్వామి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత శనివారం ఉదయం లాడ్జిలోనే నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఆత్మహత్య చేసుకునే ముందు సంతోష్ ఓ వీడియోను చిత్రీకరించాడు. ఈ వీడియోలో ‘నేను బాసం శ్రీను అనే వ్యక్తితో కలిసి వ్యాపారం చేశాను. అయితే శ్రీను దగ్గర డబ్బులు లేకపోతే జితేందర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చాడు. ఆ తరువాత వచ్చిన లాభంలో 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ అలా కుదరదని చెప్పా. అయితే నాపై కక్ఫ కట్టి ఫేస్ బుక్ లో చేసిన ఓ పోస్టుపై నన్ను ఇరికించాలని చూశారు. దీంతో నన్ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కేసు పెట్టించేందుకు ప్రయత్నించారు. అయితే మెదక్ ఎస్పీని కలిసిన తరువాత ఆ అంశంలో నాకు సంబంధం లేదన్నారు. అయితే అప్పటి వరకు నా ఫోన్ ను లాక్కున్న వారు అందులో ఉన్న సమాచారం అంతా దొంగిలించారు. ’ అంటూ బాధితుడు సంతోష్ అసలు నిజాలు వెల్లడించారు.

‘ఆ సమాచారం ఆధారంగా నన్ను వేధింపులకు గురి చేశారని... నన్ను బెదిరిస్తున్నారని’ సంతోష్ వాపోయాడు. ఈ విషయం పోలీసులకు చెప్పాని.. దాంతో నా వ్యాపారాన్ని సాగనీయలేదన్నారు. ‘అప్పులు చేశాను. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. మానసికంగా ఇబ్బంది పెట్టారు. నమ్మిన స్నేహితుడే ఇలా చేసే సరికి తట్టుకోలేకపోయా. అందుకే ఈ ఇబ్బందులు పడలేక ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని సంతోష్ వీడియోలో చిత్రీకరించారు. దీంతో ఆర్థిక వ్యవహారాలే ఈ తల్లీకూతుళ్ల ఆత్మహత్యకు కారణాలని.. వ్యాపారంలో ఇబ్బందులు.. పర్సనల్ విషయాల వల్లే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.