Begin typing your search above and press return to search.

బాబు మ‌ద్ద‌తుదారుడికే బీజేపీ అధ్య‌క్ష ఛాన్స్..మ‌త‌ల‌బేంటో!

By:  Tupaki Desk   |   3 Feb 2018 4:58 PM GMT
బాబు మ‌ద్ద‌తుదారుడికే బీజేపీ అధ్య‌క్ష ఛాన్స్..మ‌త‌ల‌బేంటో!
X
సుదీర్ఘ‌కాలంగా చ‌ర్చ‌ల‌కే ప‌రిమిత‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ ర‌థ‌సార‌థి ప్ర‌క్రియ తుది ద‌శ‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం రాష్ట్ర పార్టీ నేత‌ల‌కు స‌మాచారం చేర‌వేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. పార్టీ సీనియ‌ర్లు, మిత్ర‌పక్షంతో స‌ఖ్య‌త‌తో ఉండేవాళ్లు...టీడీపీని గ‌ట్టిగా ఎదుర్కునే నేతలు, పార్టీని బ‌లోపేతం చేయ‌గ‌లిగే సామ‌ర్థ్య‌మున్న‌నాయ‌కులు...ఇలా ప‌లుర‌కాలా వ‌డ‌పోత‌ల అనంత‌రం ఈ ప్ర‌క్రియ ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇందులో ప్ర‌ధానంగా ఇటీవ‌ల మారిన స‌మీక‌ర‌ణాలను లెక్క‌లోకి తీసుకొని...టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై దూకుడుగా స్పందించే నేత‌ల‌కు కాకుండా ఆయ‌నకు స‌న్నిహితంగా ఉండే వ‌ర్గానికే బెర్త్ ద‌క్కింది.

ఏపీ రాజ‌కీయాల‌ను గ‌మ‌నించిన వారి మాట ప్ర‌కారం రాష్ట్ర బీజేపీ ముఖ్య‌నాయ‌కుల్లో రెండుగా చీలిక ఉందని అంటున్నారు. టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిన గ్రూపులు... అంతర్గత ఆదిపత్యపోరులో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌ టీడీపీ అనుకూల వర్గంగా చెప్తున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి వంటివారు వ్యతిరేక వ‌ర్గ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. ఈ నేత‌లు అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీని టార్గెట్ చేసి.. విమర్శలు గుప్పించడంలో ముందుంటుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని వివ‌రిస్తున్నారు.

కాగా, ఏపీలో పార్టీని బలోపేతం చేయ‌డంపై దృష్టిపెట్టిన బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఈ క్ర‌మంలో ఫిబ్ర‌వ‌రి నెలాఖరుకల్లా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మైంది. ఇందులో భాగంగా విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబుకు అధ్య‌క్ష స్థానానికి ఓకే చేసిన‌ట్లు స‌మాచారం. ఈ నెలాఖ‌రులో కొత్త క‌మిటీని ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే, అదిష్టానం నూత‌న ర‌థ‌సారథుల విష‌యంలో క్లారిటీ ఇవ్వ‌డంతో ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం ఎలా స్పందిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

మరోవైపు.. కొత్త కార్యవర్గం ఏర్పడినా - ఏర్పడకపోయినా.. రాష్ట్ర బీజేపీలోని రెండు గ్రూపులు కలిసి పనిచేసే పరిస్ధితులు కనిపించడంలేదని.. ఆ పార్టీ నాయకులు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. పైకి మాత్రం బీజేపీలో ఎటువంటి గ్రూపులు లేవని, ఎవరు ఎలా మాట్లాడినా చివరికి అంతిమ లక్ష్యం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమేనని చెప్తున్నారు.