Begin typing your search above and press return to search.

మా తిక్క చూపిస్తాం..అంద‌రి లెక్క‌లు తేలుస్తాం

By:  Tupaki Desk   |   10 Feb 2018 10:03 AM GMT
మా తిక్క చూపిస్తాం..అంద‌రి లెక్క‌లు తేలుస్తాం
X
కేంద్రం ఏం ఇచ్చిందో చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్న టీడీపీ ఆరోప‌ణ‌లకు చెక్ పెట్టేందుకు బీజేపీ అధిష్టానం న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. కేంద్రం నిధుల‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదంటూ ఏపీ బీజేపీ ఎంపీ హ‌రిబాబు - బీజేపీ అధికార ప్ర‌తినిధి న‌రసింహారావు లెక్క ప‌త్రాల‌తో స‌హా ఓ నోట్ ను విడుద‌ల చేశారు.

93వ ఆర్టికల్ ప్రకారం.. విభజన చట్టంలో పేర్కొనబడిన సంస్థల ఏర్పాటు - డెవలప్‌ మెంట్ కార్యక్రమాలకు 10ఏళ్ల టైమ్ ఇచ్చారు. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే చాలా హామిలకు నిధులు కేటాయించాం. మిగిలిన వాటికి ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో కేటాయింపులు ఉంటాయ‌న్నబీజేపీ నేత‌లు మ‌న‌దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 71 సంవ‌త్స‌రాల్లో ఏ కేంద్ర ప్రభుత్వం.. ఏ రాష్ట్రానికి చేయని రీతిలో త‌మ ప్ర‌భుత్వం ఏపీ ప్రయోజనాల కోసం నిధులు కేటాయించింద‌ని కొనియాడారు.

రాష్ట్రానికి బీజేపీ ఎన్నినిధులు కేటాయించింది అని ప్ర‌శ్నిస్తున్న టీడీపీ నేత‌ల‌కు బీజేపీ ఎంపీ హ‌రిబాబు షాకిచ్చారు. కేంద్రం రాష్ట్రానికి ఇన్ని నిధులు కేటాయించిందిన అన్నీ లెక్క‌లు క‌ట్టి చూయించ‌డంతో మార్చి 5 నుంచి పార్లమెంట్‌ ఉభయసభల్లో ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. బీజేపీ విడుద‌ల చేసిన నోట్ ఆధారంగా ట్రాన్స్ పోర్ట్ నిమిత్తం ఏపీలో 3700కి.మీ ర‌హ‌దారుల నిర్మాణం కోసం కేంద్రం ల‌క్ష‌కోట్ల‌ను ఇచ్చింది. . పేద‌ల‌కు - బ‌డుగు - బ‌ల‌హీన వ‌ర్గాల కుటుంబాల‌కు 6.8ల‌క్షల ఇళ్లను మోడీ ప్ర‌భుత్వం కేటాయించింది. అంతేకాదు పోల‌వ‌రం నిర్మాణంపై త‌మ‌పార్టీకి ఉన్న చిత్త శుద్ధిని చూడండి అంటూ క‌మలం పార్టీ చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. ఇందులో భాగంగా మోడీ కేబినెట్ మీటింగ్ లో ముంపు గ్రామాల్ని ఏపీలో క‌ల‌పాల‌ని - పోల‌వ‌రం నిర్మాణానికి నిధులు కేటాయించాల‌ని ప్ర‌తిపాదించారు. ఆ ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు పోల‌వ‌రాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ. 4వేల కోట్లను ఇప్ప‌టికే చెల్లించామ‌ని బీజేపీ నేత‌లు వక్కాణించి చెబుతున్నారు.

కేంద్రం 14వ ఆర్ధిక సంఘం ఏపీకి రెవెన్యూలోటును భ‌ర్తీచేయాల‌ని సిఫార‌సు చేసింది. అందులో భాగంగా సిఫార‌సు చేసిన‌ రూ.20వేల‌కోట్ల‌లో రూ. 4వేల కోట్ల‌ను మంజూరు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6వేల కోట్లు లోటు ఉంటుందని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది.

మూడు రాష్ట్రాల‌కు 24గంట‌ల కరెంట్ ను అందించేలా త‌మ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తులు చేసింది. వాటిలో ఏపీని కూడా చేర్చిన మోడీ 24గంట‌ల క‌రెంట్ కు శ్రీకారం చుట్టారు. వీటితో పాటు సోల‌ర్ పవర్ ప్రాజెక్ట్ ను కేటాయించిన‌ట్లు హ‌రిబాబు సూచించారు.

ప్ర‌త్యేక ప్యాకేజీకి క‌ట్టుబ‌డిన టీడీపీకి అనుగుణంగా రూపాయి న‌ష్టం లేకుండా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. హోదా ద్వారా 90శాతం - హోదా లేకపోతే 60శాతం గ్రాంట్స్ కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతాయి.

దుగరాజ పట్నం ఓడరేవు - విశాఖ రైల్వే జోన్ - కేంద్రీయ విశ్వవిద్యాలయం. గిరిజన యూనివర్సిటీ - కడప స్టీల్ ప్లాంట్ ల‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర‌ బీజేపీ చ‌ర్య‌లు తీసుకుంది. అందులో ఆయా సంస్థ‌ల నిర్మాణానికి పార్ల‌మెంట్ లో బిల్లు ప్ర‌వేశ పెట్టాలి. ఆ అవ‌స‌రం లేకుండా బీజేపీ రూ.10కోట్లు విడుద‌ల చేసింది. పూర్తి స్థాయిలో సంస్థ‌ల ఏర్పాటు త్వ‌ర‌లో స‌మావేశం ఏర్పాటు చేస్తున్న హ‌రిబాబు స్ప‌స్టం చేశారు.

ఇక తాము ఇచ్చిన హామీల్లో జ‌ర‌గాల్సిన వాటి గురించి, అందుకు ఎదురైన అడ్డంకుల‌పై హ‌రిబాబు వివ‌ర‌ణిచ్చారు. వాటిల్లో ద‌గ‌రాజ ప‌ట్నం ఓడ‌రేవు పై అభ్యంత‌రాలు - విశాఖ రైల్వే జోన్ స‌రిహ‌ద్దులు - పెట్రోలియం రంగంలో లక్ష కోట్ల ప్రతిపాదనలు చేశాం.. పెట్రోలియం కాంప్లెక్స్ పై కూడా చర్చ జరుగుతున్న‌ట్లు ఏపీ బీజేపీ నేత‌లు సూచించారు.

అమ‌రావ‌తి నిర్మాణం కోసం ఇప్ప‌టికే రూ.2500కోట్లు కేటాయించాం. వీటితో పాటు కృష్ణా - గోదావరిల్లో చమురు నిక్షేపాల కోసం ఓఎన్జీసీ లాంటి సంస్థలు - అంతర్గత జలరవాణా కోసం 7వేల కోట్లు కేటాయించామ‌ని చెప్పుకొచ్చారు.

ఇక తాను చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌పై రాజకీయ పరిశోధన చేసే ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా సరే దీన్ని పరిశీలించవచ్చు. నేను చెప్పినవాటిల్లో ఏదైనా తప్పు ఉంటే.. నన్ను ప్రశ్నించండి. వాటికి సమాధానం చెప్పడానికి మేము సిద్దంగా ఉన్నామ‌ని ఎంపీ హ‌రిబాబు - అధికార ప్ర‌తినిధి న‌రసింహారావు చెప్పారు.

దీంతో కంగుతిన్న టీడీపీ నేత‌లు ఉండ‌వ‌ల్లిలో చంద్ర‌బాబు అధ్య‌క్ష‌న భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలుగు త‌మ్ముళ్ల‌కు బీజేపీ త‌ప్పుడు లెక్క‌లు చూపిస్తే ఉపేక్షించ‌వ‌ద్దు అని చంద్ర‌బాబు నూరిపోశారు.