Begin typing your search above and press return to search.

వైసీపీ బీజేపీ కలిస్తే.. నీకేంటి బాబు ?

By:  Tupaki Desk   |   28 April 2018 5:36 PM GMT
వైసీపీ బీజేపీ కలిస్తే.. నీకేంటి బాబు ?
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కామెంట్ల ఆధారంగానే...ఆయ‌న్ను ఇర‌కాటంలో పెట్టేందుకు తాజా మాజీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ సిద్ధ‌మైంది. టీడీపీ విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోతే బాబు దూకుడు పెరుగుతుంద‌ని భావించి వారి కామెంట్ల ఆధారంగానే ఇర‌కాటంలో ప‌డేసే ఎత్తుగ‌డ‌లు అమ‌లు చేస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ - పార్టీ మాజీ అధ్య‌క్షుడు కంభంపాటి హరిబాబు మీడియాతో మాట్లాడుతూ త‌మ పార్టీ బ‌లోపేతం - ప్ర‌జాసేవ కంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన‌ వైసీపీ గురించే చంద్ర‌బాబు ఎక్కువ‌గా ఆలోచిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. వైసీపీ-బీజేపీ కలవబోతుందని సీఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎలాంటి చ‌ర్చ లేని అంశం గురించి ఇంత చ‌ర్చ ఎందుకని హ‌రిబాబు సూటిగా ప్ర‌శ్నించారు.

ఎన్డీఏ కూట‌మి నుంచి టీడీపీ వైదొల‌గిన నేప‌థ్యంలో వైసీపీ త‌మ కూట‌మిలో చేరాల‌ని కేంద్ర సహాయమంత్రి అథవాలే వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీని ఆధారంగా వైసీపీ-బీజేపీ దోస్తీపై చంద్ర‌బాబు స‌హా ఆ పార్టీ నేలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న నేప‌థ్యంలో హ‌రిబాబు కౌంట‌ర్ ఇచ్చారు. అథ‌వాలే వ్యాఖ్యలు బీజేపీ అభిప్రాయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహంపై భాజపాలో ఇప్పటి వరకూ చర్చ జరగలేదని తెలిపారు. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడంపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టామని ఆయన వివరించారు. వివిధ కార‌ణాల‌ను పేర్కొంటూ కాంగ్రెస్‌కు దగ్గర కావాలని చంద్రబాబు చూస్తున్నారని హరిబాబు ఆరోపించారు. చంద్రబాబు పదే పదే కేసుల విషయం ప్రస్తావించడం చిత్రంగా ఉంద‌న్నారు. చంద్రబాబు గురించి కేంద్ర పెద్దలు ఎవరూ మాట్లాడటం లేదని తెలిపారు. అలాంటిది కేసులంటూ చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని హరిబాబు ప్ర‌శ్నించారు. ఇంత త‌ర‌చుగా మాట్లాడ‌టం చూస్తే ఏదైనా తప్పు జరిగిందేమోనన్న అనుమానం కలుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏమి చేయలేని టీడీపీ ప్రభుత్వం బీజేపీపై నిందలు వేస్తూ పబ్బం గడుతుంతోదని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలోని తీసుకుని చంద్రబాబు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుతున్నారని విమర్శించారు.