Begin typing your search above and press return to search.

వాళ్లను చూస్తే జాలి వేస్తోంది, పాపం!

By:  Tupaki Desk   |   6 Sep 2016 11:30 AM GMT
వాళ్లను చూస్తే జాలి వేస్తోంది, పాపం!
X
ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు భాజపా నాయకులను చూస్తే జాలి కలుగుతోంది. పురందేశ్వరి లాంటి అతివాదుల సంగతి వేరు, కానీ కంభంపాటి హరిబాబు లాంటి మితవాదులు.. ప్రత్యేకించి ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారుకు , అటు కేంద్రంలోని తమ సొంత మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడాలన్నా సాహసించలేని వాళ్లను చూసినప్పుడు జాలి కలుగుతోంది. వారి జీవితం ఒక రకంగా బజార్న పడుతున్నదని చెప్పాలి. పబ్లిక్‌ లోకి వెళ్లడమే ఆలస్యం.. హోదా విషయంలో మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నది సార్‌ అంటూ మీడియా వాళ్లు వెంటపడుతుంటారు.

ఏం చెప్పడానికీ వీరికి తెలియదు. ఏం చెబితే.. ఎలాంటి పితలాటకం ముంచుకొస్తుందో అని ఒక వైపు భయం. ప్రత్యేకించి హరిబాబు లాంటి మితవాదులైతే.. చంద్రబాబు సర్కారు మీద నిందలు వేయడానికి కూడా ఇష్టపడే రకాలు కాదు. అలాగని కేంద్రంలోని మీ పార్టీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేస్తోంది సారూ అని మీడియా అడిగితే జవాబు లేదు.

దీంతో పాత జవాబుల్నే వాళ్ల వద్ద మళ్లీ రిపీట్‌ చేస్తూ సతమతం అయిపోతున్నారు. తమ నోటినుంచి ప్రత్యేకహోదా అనే పదం వినిపించకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటూనే, ''రెవిన్యూలోటు పూడ్చడానికి కేంద్రం అంగీకరించింది. వెనకబడ్డ జిల్లాలకు నిదులు ఇవ్వడానికి ఒప్పుకుంది'' వంటి పాతచింతకాయ పచ్చడి సంగతులనే హరిబాబు చెబుతున్నారు.

కానీ అదే సమయంలో.. కేంద్రం ప్రకటించబోయే ప్యాకేజీ ఎంత ఘనంగా ఉన్నా సరే, ఎంత నీచంగా ఉన్నా సరే, ఆ విషయంతో సంబంధం లేకుండా.. దాన్ని గురించి పాజిటివ్‌ గా ప్రచారం చేయడానికి, ఇదంతా రాష్ట్ర భాజపా ఘనత మాత్రమేనని, తమ పూనికతోనే రాష్ట్రానికి ఇంత గొప్ప ప్యాకేజీ వచ్చిందని.. రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రచారం చేసుకోవడానికి వారు ఇప్పటినుంచే సిద్ధం అయిపోతున్నారన్నమాట మాత్రం వాస్తవం.