Begin typing your search above and press return to search.

కమల దళపతికి రెండు నాలుకలా?

By:  Tupaki Desk   |   26 Aug 2016 9:24 AM GMT
కమల దళపతికి రెండు నాలుకలా?
X
ఏపీ ప్రయోజనాలకు గండికొట్టే విషయంలో కేంద్రం ఎన్ని మోసాలు చేసినా సరే.. వాటిని సమర్థించడమే తమ పనిగా రాష్ట్ర భాజపా నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అందులో వారు ఆరితేరిపోయారు. అయితే వారి సొంత ప్రయోజనాలు - అనగా సొంత ప్రాంత ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి మాత్రం.. నిబంధనలు అన్నీ పక్కన పెట్టి అయినా సరే.. పని పూర్తి చేసేయమని విన్నవిస్తారు. హోదా విషయంలో కేంద్రం చేస్తున్న వంచన గురించి తెలుగు జనాలకు మాయమాటలు చెప్పడం - నిత్యం మోదీ భజన చేయడం మాత్రమే కాకుండా ఏపీ భాజపా నాయకులు.. తమ తమ సొంత ప్రాంతాలకు మాత్రం ప్రయోజనాలు కోరుకుంటున్నారు.

అసలు సంగతేంటంటే.. తాజాగా ఏపీ భాజపా చీఫ్‌ హరిబాబు.. హోదా గురించి కొత్త మాయమాటలను శుక్రవారం నాడు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేకహోదా ఇవ్వడం గురించి , దానివలన వారికి చేకూరగల ప్రయోజనాల గురించి లేదా సాయం రూపంలో అంతకంటె ఎక్కువ మేలు చేయడం గురించి ఢిల్లీలో ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయిట. అయితే ఈ చర్చలు ఎప్పటివరకూ జరుగుతాయో మాత్రం ఆయన చెప్పలేదు. అదే సమయంలో.. ఏపీ రెవిన్యూ లోటుకు సంబంధించి సాయం అందించే విషయంలో కూడా ఇంకా లెక్కలు తేలుస్తున్నారట. ఇచ్చిన సాయం చివరిది కాదుట. అలాగే పోలవరం విషయంలో దాన్ని కేంద్రం ఎంత త్వరగా పూర్తిచేస్తుందనే సంగతి.. చంద్రబాబు పనితీరును బట్టి ఆధారపడి ఉంటుందిట. ఈ స్టేట్‌ మెంట్లు అన్నీ గమనిస్తే.. కేంద్రప్రభుత్వం పాడుతున్న పాటలకు తాన తందానా అన్నట్లే కనిపిస్తుంది. ఇన్ని విషయాల్లో కేంద్రం మీద ఈగ వాలనివ్వకుండా మాటలు పేరుస్తున్న హరిబాబు - విశాఖపట్నం రైల్వేజోన్‌ అయ్యే విషయంలో మాత్రం కమిటీలతో నిమిత్తం లేకుండా.. వెంటనే జోన్‌ ప్రకటించాలని అడుగుతున్నారు.

కంభంపాటి హరిబాబు విశాఖపట్నంకు చెందిన నాయకుడు కాబట్టి... ఆయన సొంత ఊరికి రైల్వేజోన్‌ మాత్రం కమిటీలతో నిమిత్తం లేకుండా వచ్చేయాలంటున్నారు. రాష్ట్రం ఎలా తగలడిపోయినా - మోదీ సర్కారు - తనకు రైల్వేజోను ఇచ్చేసి.. మొత్తం రాష్ట్రాన్ని ఎలా తగలెట్టేసినా పర్లేదని.. తాను దీన్ని సాధించినట్లుగా టముకువేసుకుంటూ రాజకీయంగా స్థిరపడిపోవచ్చునని ఆయన ఆలోచిస్తున్నట్లుగా ఉంది. అందుకే సిద్ధాంతాల పార్టీగా చెప్పుకునే భాజపా దళపతుల్లో కూడా రెండు నాలుకల ధోరణి ముదురుతున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.