Begin typing your search above and press return to search.

ఏపీకి ఎంతో చేశాం..ఎందుకు మాపై విమ‌ర్శ‌లు

By:  Tupaki Desk   |   7 March 2018 5:28 PM GMT
ఏపీకి ఎంతో చేశాం..ఎందుకు మాపై విమ‌ర్శ‌లు
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలో చేసిన ప్ర‌క‌ట‌న‌, టీడీపీ నేత‌ల ప్ర‌క‌ట‌న‌ల నేప‌థ్యంలో...బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ఏపీ అధ్జ్ఞ‌క్షుడు కంభంపాటి హరిబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మిత్ర‌ప‌క్షం వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు. చట్టంలో చెప్పినవి అమలు చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని....దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని సాయాన్ని ఏపీకి ఈ మూడున్నరేళ్లలో చేసిందన్నారు. అయిన‌ప్ప‌టికీ త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం స‌రికాద‌ని అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని సంస్థలు ఏపీకి వచ్చాయని హ‌రిబాబు తెలిపారు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ్యం కాద‌ని ఈ విష‌యం గుర్తించాల‌ని బీజేపీ ఎంపీ హరిబాబు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు హోదాకు సమానమైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని హరిబాబు గుర్తుచేశారు. రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తుంది... చట్టంలో చెప్పినవి అమలు చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని అన్నారు. దుగరాజపట్నం పోర్టు - రైల్వేజోన్‌ - కడప స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం సానుకూలంగా ఉందని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు. తాజాగా కూడా కేంద్రంలోని పెద్ద‌ల‌తో క‌లిశామ‌న్నారు. ఇవాళ ఉదయం మంత్రి గంటాతో కలిసి కేంద్రమంత్రి జావదేకర్‌ ను కలిశామన్నారు. కేంద్రీయ - గిరిజన విశ్వవిద్యాలయాలకు జావదేకర్‌ అమోదం తెలిపారన్నారు. ఇంతగా ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం పాలుప‌డుతున్న‌ప్ప‌టికీ త‌మ‌పై విప‌క్షాలు స‌హా మిత్ర‌ప‌క్షం సైతం విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమిట‌ని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు వ్యాఖ్యానించారు.