Begin typing your search above and press return to search.

ఓటుకు నోటుః బీజేపీ సేఫ్ గేమ్‌

By:  Tupaki Desk   |   1 Sep 2016 12:39 PM GMT
ఓటుకు నోటుః బీజేపీ సేఫ్ గేమ్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును తీవ్ర ఇర‌కాటంలో ప‌డేసిన‌ ఓటుకు నోటు కేసు ప‌రిణామం అన్ని వర్గాల్లోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ పై ఆయా పార్టీలు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నాయి. అయితే మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అధికారిక స్పంద‌న ఏదీ రాలేదు. ఈ ప‌రిణామంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు - విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు స్పందించారు. అయితే ఈ వివ‌ర‌ణ‌లో ఎక్క‌డ కూడా త‌మ వాదన ఏంట‌నేది స్ప‌ష్టంగా తెలియ‌జెప్ప‌కుండా సేఫ్ గేమ్‌ కు ప్రాధాన్యం ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రం.

ఓటుకు నోటు కేసులో పునర్విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తనపై కేసు కొట్టేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిషన్ దాఖ‌లు చేసిన ప‌రిణామంపై బాబు సొంత జిల్లా చిత్తూరు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న హ‌రిబాబు స్పందించారు. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొనేవారు ఏం చేయాలో వారు అదే చేస్తున్నారని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. అయితే చట్టం ఏం చేయాలో అదే చేస్తుందని హ‌రిబాబు వివ‌రించారు. మీ వైఖ‌రి ఏమిట‌న‌గా, స‌మాధానం దాట‌వేశారు. మ‌ర‌వైపు ఏపీ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఏం చేస్తుందో మ‌రోమారు హ‌రిబాబు వివ‌రించారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఆంధ్ర‌ప్రదేశ్‌కు 8 జాతీయ సంస్థలు, రక్షణ సంస్థలు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేసింద‌ని హ‌రిబాబు తెలిపారు. జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చర్చలు జరుగుతున్నాయని ఆయ‌న వివ‌రించారు. ఏపీకి ఏ విధంగా న్యాయం చేయాల‌నే విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం, బీజేపీ స్ప‌ష్ట‌త‌తో ఉంద‌ని హ‌రిబాబు పున‌రుద్ఘాటించారు.