Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఆత్మనూ చంద్రబాబు వదలడం లేదట

By:  Tupaki Desk   |   20 July 2018 4:31 PM GMT
ఎన్టీఆర్ ఆత్మనూ చంద్రబాబు వదలడం లేదట
X
తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు తన జీవితకాలమంతా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం విషయంలో ఆయన ఎన్నడూ రాజీపడలేదు. కానీ... ఆయన చేతి నుంచి పార్టీని లాక్కున్న చంద్రబాబునాయుడు ఇప్పుడు కాంగ్రెస్‌ తో అంటకాగుతూ ఎన్టీఆర్ ఆత్మనూ క్షోభపెడుతున్నారని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. బీజేపీలో చంద్రబాబుకు అనుకూలుడిగా పేరున్న హరిబాబు తొలిసారి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు బండారాన్ని ఆయన బయటపెట్టారు. హరిబాబు అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతల వద్ద సమాధానమే కరవైంది.

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మాట్లాడిన హరిబాబు టీడీపీని హడలెత్తించారు. తన ప్రశ్నలతో టీడీపీ ఎంపీలను ఉక్కిరిబిక్కిరి చేశారు. పనిలో పనిగా చంద్రబాబుకు మద్దతుగా ఉన్న కాంగ్రెస్ నూ చెడుగుడు ఆడారు. కాంగ్రెస్‌ కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు విభజన చట్టంలో చేర్చలేదని ఎంపీ ప్రశ్నించారు. అంతేకాక ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతల దగ్గరకెళ్లి టీడీపీ నాయకులు చర్చలు జరపడంపై ఆయన మండిపడ్డారు. మీ చర్యలతో ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తోందని అన్నారు. ‘కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ జీవితమంతా కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా పోరాడారు. మీరు నిస్సిగ్గుగా కాంగ్రెస్‌ తో చేతులు కలిపారు. కాంగ్రెస్‌ నేతలతో టీడీపీ నేతలు ఫ్లోర్‌ కోఆర్డినేషన్‌ చేశారని ఆరోపించారు.

రాష్ట్రం విడిపోతే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ నమ్మింది. రాష్ట్ర విభజన చేయాలని టీడీపీనే లేఖ ఇచ్చింది. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. నాబార్డు - హడ్కో ద్వారా సాయం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ నుంచి వినతులను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అంగీకరించారు. మీకు హోదా అనే పేరు ముఖ్యమా లేక ఆర్థిక సాయం ముఖ్యమా? పోలవరం ప్రాజెక్ట్‌కు ఇప్పటి వరకు రూ. 6,374 కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్ట్‌ ను కేంద్రమే పూర్తి చేస్తుంది. కడప స్టీల్‌ ప్లాంట్‌ పై కమిటీ వ్యతిరేక రిపోర్టు ఇచ్చింది. అయినా స్టీల్‌ ప్లాంట్‌ పై కేంద్రం టాస్క్‌ ఫోర్స్‌ ను ఏర్పాటు చేసింది’. అని ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు.