Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్ గా కంభంపాటి హ‌రిబాబు

By:  Tupaki Desk   |   6 July 2021 8:41 AM GMT
గ‌వ‌ర్న‌ర్ గా కంభంపాటి హ‌రిబాబు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నేత‌, విశాఖ‌ప‌ట్నం మాజీ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు గ‌వ‌ర్న‌ర్ అయ్యారు. మిజోరాం గ‌వ‌ర్న‌ర్ గా కంభంపాటి హ‌రిబాబును నియ‌మిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌రో ఎనిమిది రాష్ట్రాల‌కు సైతం కొత్త గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించింది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న తెలంగాణ బీజేపీ నేత ద‌త్తాత్రేయ‌ను.. హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ గా బ‌దిలీ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది. ద‌త్తాత్రేయ స్థానంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు రాజేంద్ర‌న్ విశ్వ‌నాథ్ ను పంపించింది. అదేవిధంగా.. క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ గా థావ‌ర్ చంద్ గెహ్లాట్ ఎంపిక‌య్యారు. థావ‌ర్ చంద్‌ ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు.

అదేవిధంగా.. గోవా రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ గా శ్రీధ‌ర‌న్ పిళ్లై నియ‌మితుల‌య్యారు. ఈయ‌న ప్ర‌స్తుతం మిజోరాం గ‌వ‌ర్న‌ర్ గా ఉన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ గా మంగూబాయి చ‌గ‌న్ భాయ్ ప‌టేల్‌, త్రిపుర గ‌వ‌ర్న‌ర్ గా స‌త్య‌దేవ్ నారాయ‌ణ్ ఆర్య‌, జార్ఖండ్ గ‌వ‌ర్నర్ గా ర‌మేష్ బ‌యాస్ నియ‌మితుల‌య్యారు.

కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రగ‌నున్న నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ల నియామ‌కం చేప‌ట్ట‌డం ప్రాథాన్య‌త సంత‌రించుకుంది. ఆశావ‌హులుగా ఉన్న‌వారిని బుజ్జగించేందుకు కేంద్రం ఈ నియామ‌కాలు చేప‌ట్టింద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఉన్న‌ట్టుండి ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డంతో అతి త్వ‌ర‌లో కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కుదిరితే రేపే కేబినెట్ ను విస్త‌రించినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.