Begin typing your search above and press return to search.

విడిపోవ‌డం వ‌ల్లే ఏపీ అభివృద్ధి...బాబు శ్ర‌మ‌జీవి

By:  Tupaki Desk   |   8 March 2018 9:34 AM GMT
విడిపోవ‌డం వ‌ల్లే ఏపీ అభివృద్ధి...బాబు శ్ర‌మ‌జీవి
X
ఏపీ రాజకీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మిత్ర పక్షాలుగా ఉన్న టీడీపీ-బీజేపీ మంత్రులు రాజీనామాల బాట పట్టారు. కేంద్రంలో మంత్రి పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ నిర్ణయిస్తే… అంతే స్పీడుగా రాష్ట్ర కేబినెట్ నుంచి వైదొలగాలని బీజేపీ నిర్ణయించింది. దానికి అనుగుణంగానే ఈ రోజు సీఎం చంద్రబాబును నాయుడుని కలిసిన తమ రాజీనామా లేఖలను సమర్పించారు. బీజేపీకి చెందిన మంత్రులు కామినేని శ్రీనివాస్ - మాణిక్యాలరావు సీఎం చాంబర్‌ కు వెళ్లి చంద్రబాబును కలిసి రాజీనామాలు సమర్పించారు. రాజీనామా లేఖను సీఎంకు ఇచ్చిన వెంటనే మాణిక్యాలరావు వెళ్లి పోగా కామినేని శ్రీ‌నివాస్ ప్ర‌త్యేకంగా చంద్ర‌బాబుతో ముచ్చ‌టించారు!

అనంత‌రం వారు మీడియాతో - అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ మంత్రిగా అవకాశం ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు అని అన్నారు. తనకు మంత్రి పదవి రావడానికి కారణం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడేనని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజ్యసభలో వెంకయ్య నాయుడు చేసిన పోరాటం గొప్పదని కొనియాడారు. అలాగే సోము వీర్రాజు - తాడేపల్లి ప్రజలకు కృతజ్ఞతలు అని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. విశాఖను వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేశామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని మాణిక్యాల‌రావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితోనే నేను చాలా నేర్చుకున్నాను అని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా తన శాఖలో మార్పులు తీసుకొచ్చేందుకు పని చేశానని అన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని అన్నారు.

ఏపీ విడిపోవడం వలనే అభివృద్ధి చెందుతోందన్నది అక్షర సత్యమ‌ని మాణిక్యాలరావు అన్నారు. సమైక్యాంద్ర ఉద్యమం చేసిన వాళ్ళది తప్పని ఇపుడు నిరూపితమైందని, విభజన తర్వాత రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నామ‌ని మాణిక్యాలరావు అన్నారు. పోలవరం అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని తెలిపారు. ఏపీ పట్ల ప్ర‌ధాని మోడీ చిత్తశుద్ధిని అర్థంచేసుకోవాలని కోరుతూ ఏపీకి అండగా ఉన్న బీజేపీని దోషిగా చూస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పుష్కరాల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని మాణిక్యాలరావు పేర్కొన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ.. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడే ఉంటానని మాణిక్యాల‌రావు చెప్పారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై మ‌రో మాజీ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ ప్ర‌శంస‌లు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబులా ఎవరూ కష్టపడలేదని ఆయన కష్టపడి పనిచేసే తత్వాన్ని ప్రశంసించిన కామినేని `మూడున్నరేళ్ల పాటు మీతో కలిసి పనిచేశా… నాపై మీ అభిప్రాయం ఏంటి?`అని సీఎంను అడిగానని దానికి ఆయన `నీలాంటి అజాత శత్రువును చూడలేదు` అని చంద్రబాబు చెప్పినట్టుగా అసెంబ్లీలో తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి బీజేపీయే కారణమని పేర్కొన్నారు. త‌న‌ను బీజేపీలో చేరాలని వెంకయ్య నాయుడు తనని ఆహ్వానించారని ఆయ‌న గుర్తుచేసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తాను టీడీపీ - బీజేపీ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. చంద్రబాబు పాలనను ప్రశంసిస్తూనే అటు ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి కామినేని ఎత్తేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఆయన నీతి నిజాయితీతో… 21 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చారని విదేశాల్లో సైతం మన ఖ్యాతిని చాటారన్నారు. తాను తప్పు చేసినట్టు ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.