Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీ భ‌వ‌నంపై కామినేని ఏమ‌న్నారంటే!

By:  Tupaki Desk   |   16 March 2017 7:36 AM GMT
ఏపీ అసెంబ్లీ భ‌వ‌నంపై కామినేని ఏమ‌న్నారంటే!
X
రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా ఏర్ప‌డ్డ న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ది బాట ప‌ట్టించేందుకు అహ‌ర‌హం శ్రమిస్తున్నామ‌ని టీడీపీ అధినేత‌, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబునాయుడు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర పురోగ‌తి కోసం తామెన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామంటూ బాబు అండ్ కో రోజుకో కొత్త విష‌యాన్ని వ‌ల్లె వేస్తున్నారు. ఇక న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానిగా ఎంపిక చేసిన అమ‌రావ‌తిలో ఇప్ప‌టిదాకా నిర్మాణం పూర్తి చేసుకున్న భ‌వనాలు ఎన్ని ఉన్నాయంటే.... క్ష‌ణం త‌డుముకోకుండానే రెండే క‌దా అనే స‌మాధానం వ‌స్తుంది. ఆ రెండు ఏవంటే... ఒక‌టి తాత్కాలిక స‌చివాలయం, రెండోది ఇటీవ‌లే అందుబాటులోకి వ‌చ్చిన తాత్కాలిక అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయం.

అధికారులు, మంత్రుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక స‌చివాల‌యంలో లోప‌ల వ‌స‌తులు కాస్తంత మెరుగ్గానే ఉన్నా... విశాలంగా లేవంటూ అందులో అడుగుపెట్టేందుకు స‌సేమిరా అన్న మంత్రుల అల‌క‌లు మ‌న‌కు తెలిసిందే. ఎలాగోలా మంత్రుల‌ను దారికి తెచ్చుకున్న చంద్ర‌బాబు... ఇప్పుడు అందుబాటులోకి వ‌చ్చిన తాత్కాలిక అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయంపై తెలుగు త‌మ్ముళ్లు విసురుతున్న విమ‌ర్శ‌లు, చ‌లోక్తుల‌కు ఎలా క‌ళ్లెం వేస్తారో చూడాలి. అయినా తెలుగు త‌మ్ముళ్లంతా ఆహా, ఓహో అన్న రీతిలో అసెంబ్లీ భ‌వ‌నం ఉంద‌ని మీడియా కోడై కూస్తోంటే... ఇక దానిపై తెలుగు త‌మ్ముళ్లు విమ‌ర్శ‌లు ఎందుకు గుప్పిస్తార‌నేగా మీ డౌటు. అక్క‌డికే వ‌స్తున్నాం. నేటి ఉద‌యం ఉభ‌య స‌భ‌లు ప్రారంభం కాగానే... అధికార పార్టీ స‌భ్యుల‌తో పాటు విప‌క్ష స‌భ్యులు కూడా నిర్ణీయ స‌మ‌యానికే స‌భా ప్రాంగ‌ణానికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో త‌మ పార్టీ లెజిస్లేచ‌ర్ కార్యాల‌యాలు (టీడీఎల్పీ - వైసీఎల్పీ) ఎక్క‌డున్నాయ‌న్న విష‌యం అర్థం కాక తెలుగు త‌మ్ముళ్లు తిక‌మ‌క ప‌డ్డార‌ట‌.

ఇక బాబు కేబినెట్లో కీల‌క శాఖ మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ అయితే... అస‌లు శాస‌న‌మండ‌లి ప్ర‌వేశ ద్వారం ఎక్కడుందో కూడా క‌నిపెట్ట‌లేక‌పోయార‌ట‌. ఈ క్ర‌మంలో ఆయ‌న వేరే హాలులోకి ప్రవేశించ‌బోయి... లోప‌ల‌కు చూసిన వెంట‌నే అది మండ‌లి భ‌వ‌నం కాద‌ని తెలుసుకుని వెనుదిరిగార‌ట‌. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన మీడియా ప్ర‌తినిధులు... అదేంటీ మీరు క‌ట్టించిన భ‌వ‌నం ప్ర‌వేశ ద్వారాలు కూడా మీకు తెలియ‌వా? అంటూ ప్ర‌శ్నించార‌ట‌. దీంతో స్పందించిన త‌ప్ప‌ని ప‌రిస్థితిలో నోరు విప్పిన కామినేని అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయం మ‌య‌స‌భ‌లా ఉంద‌ని వ్యాఖ్యానించార‌ట‌. ఏదెక్క‌డుందో అర్థం కావ‌డం లేదు. మంత్రుల చాంబ‌ర్లు - ఆయా పార్టీల శాస‌న‌స‌భాప‌క్ష కార్యాల‌యాలు - అసెంబ్లీ గేట్లు - మండ‌లి ప్ర‌వేశ ద్వారాలు ఎక్క‌డున్నాయ‌న్న విష‌యంపై నేనొక్క‌డినే కాదు. చాలా మంది తిక‌మ‌క ప‌డుతున్నారు. కొత్త భ‌వ‌నం క‌దా. ఇంకా అల‌వాటు కాలేదు. అల‌వాటు ప‌డేదాకా ఈ ఇబ్బంది త‌ప్ప‌దు* అని కామినేని సుదీర్ఘ వివ‌ర‌ణే ఇచ్చార‌ట‌. ఇక టీడీపీ ఎమ్మెల్యే న‌క్కా ఆనంద‌బాబు కూడా ఇదే త‌ర‌హా వాద‌న‌ను వినిపించ‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/