Begin typing your search above and press return to search.

నిన్నటి కసిని ఇవాళ తీర్చుకున్న కామినేని

By:  Tupaki Desk   |   16 July 2016 10:00 AM GMT
నిన్నటి కసిని ఇవాళ తీర్చుకున్న కామినేని
X
ఏ చిన్న అవకాశం చిక్కినా విరుచుకుపడే తత్వం రాజకీయ నాయకుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక.. అనుకోని విధంగా ఏదైనా ఘటన చోటు చేసుకుంటే అధికారపక్షంపై విపక్షాలు ఎంతగా విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో శిశివు అపహరణ చోటు చేసుకోవటం తెలిసిందే.

ఈ సందర్భంగా ఏపీ అధికారపక్షం తీరుపై విపక్షాలు ఎడాపెడా విరుచుకుపడ్డాయి. ఏపీ అధికారపక్షం చేతకానితనంపై మండిపడిన నేతలు పనిలో పనిగా ఆ శాఖను నిర్వర్తిస్తున్న వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ పైనా తీవ్ర విమర్శలు చేశారు. కారణం ఏదైనా అనుకోకుండా జరిగిన ఈ ఘటనపై రాజకీయ పక్షాలు రాజకీయ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మౌనంగా ఉన్న ఆయన.. తనలోపలి కోపాన్ని తాజాగా ప్రదర్శించారు.

శిశువును అపహరించిన వారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవటంతో ఈ ఎపిసోడ్ సుఖాంతం కావటం తెలిసిందే. దీంతో.. కామినేని రియాక్ట్ అయ్యారు. దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్న వేళ విపక్షాలు ఎంత త్వరగా స్పందిస్తాయో.. అలానే మంచి జరిగినప్పుడు కూడా స్పందిస్తే బాగుంటుందన్న చురకులు తగిలించిన కామినేని.. ‘‘నిన్న విమర్శలు గుప్పించిన కమ్యూనిస్టులు.. కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలంతా ఎక్కడికి వెళ్లారు. ఇప్పుడు వారంతా ఏమయ్యారు. ఘటన జరిగిన 36 గంటల వ్యవధిలో ఈ కేసును పోలీసులు చేధించారు’’ అని చెప్పారు. ఈ కేసును పరిష్కరించిన అధికారుల్ని కామినేని ప్రత్యేకంగా ప్రశంసించారు. శిశువు అపహరణ ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా.. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రితో పాటు.. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.