Begin typing your search above and press return to search.

ఏపీ అధికార పక్షంలో ఉంది ఒక్క మగాడేనా?

By:  Tupaki Desk   |   29 Jun 2016 4:29 PM GMT
ఏపీ అధికార పక్షంలో ఉంది ఒక్క మగాడేనా?
X
కారణాలు ఏమైతేనేం.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యేక ఉద్యమం జరిగిన సమయంలో తెలంగాణ నేతలు.. ఉద్యమకారులు తరచూ సీమాంధ్ర గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేసే వారు. దీనికి కౌంటర్ అటాక్ చేసే విషయంలో సీమాంధ్ర నేతలు పెద్దగా రియాక్ట్ అయ్యేవారుకాదు. కొన్ని వాదనల మీద మాట్లాడితే హైదరాబాద్ లో ఉన్న తమ ఆర్థిక ప్రయోజనాలు ఎక్కడ దెబ్బ తింటాయో అని కొందరు.. లేనిపోని రచ్చ మనకెందుకని మరికొందరు.. మనం మాట్లాడితేనే ఏమవుతుంది? అని ఇంకొందరు ఇలా ఎవరికివారు.. ఏపీ మీద పడిన విమర్శల మరకల్ని చెరిపే ప్రయత్నం చేయలేదు.

ఉద్యమ సమయంలో ఏ మాట అంటి ఏ రకంగా టర్న్ అవుతుందోనన్న భయాన్ని కొంత అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం విడిపోయి.. ఎవరికి లెక్కలు వాళ్లు చూసుకుంటూ.. ఎవరి ప్రయోజనాలు వారికే ముఖ్యమని తేల్చేసుకున్న తర్వాత కూడా మౌనంగా ఉండటం.. కొన్ని అంశాల విషయంలో స్పందించకపోవటం లాంటివి ఆశ్చర్యకరంగా మారాయని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టును ఎందుకు విభజన చేయలేదన్న అంశంతో పాటు..జడ్జిల కేటాయింపుల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణ జడ్జిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు చేస్తున్న కుట్ర కారణంగా హైకోర్టు విభజన జరగలేదని తెలంగాణ అధికారపక్ష నేతలు పలువురు తీవ్రస్థాయిలో ఏపీ సర్కారును తప్పు పడుతున్నారు. కేసీఆర్ కుమార్తె.. కమ్ ఎంపీ కవిత సైతం హైకోర్టు విభజన వ్యవహారం ఆంధ్రోళ్ల కుట్రగా అభివర్ణించారు. ఇంతలా విమర్శలు చేస్తున్నా ఒక్కరంటే ఒక్క ఏపీ అధికారపక్ష నేత బలంగా తమ వాదనను వినిపించింది లేదు. ఆంధ్రోళ్ల కుట్ర కారణంగా హైకోర్టు విభజన ఆగిపోయిందన్న వాదనకు తమ వెర్షన్ ఎందుకు చెప్పటం లేదన్నది ఏపీ ప్రజల ప్రశ్నగా ఉంది. తాజాగా వారి బాధను అర్థం చేసుకున్నారో ఏమో కానీ.. ఒక్క నేత ఈ అంశంపై పెదవి విప్పటమేకాదు.. ఏపీ వాదనను వినిపించే ప్రయత్నం చేశారు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్.

హైకోర్టు విభజన విషయంలో తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతిలో హైకోర్టుకు స్థలం కేటాయించామని.. అయినప్పటికీ ఆ విషయాన్ని గుర్తించకుండా విమర్శలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై చెలరేగిన వివాదంపై దృష్టి మళ్లించటానికే హైకోర్టు ఉదంతాన్ని తెర మీదకు తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను ప్రాంతీయ వివాదాల్లోకి లాగటం సరికాదన్న ఆయన.. కేసీఆర్ తన చేతిలో పరిష్కారమయ్యే అంశాల మీద ఎందుకు దృష్టి పెట్టరని ప్రశ్నించారు. ఏమాటకు ఆ మాటే చెప్పాలి. ఈ మాత్రం ఏపీ తరఫున మాట్లాడిన మొనగాడుగా కామినేనిని చెప్పాలి. మిగిలిన ఏపీ మంత్రులు కామినేనిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.