Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ తో దోస్తీ ఉంది కానీ పార్టీ మార‌ట్లేదంటున్న మంత్రి

By:  Tupaki Desk   |   23 Aug 2017 5:05 PM GMT
ప‌వ‌న్‌ తో దోస్తీ ఉంది కానీ పార్టీ మార‌ట్లేదంటున్న మంత్రి
X
సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతున్న చ‌ర్చ‌పై ఏపీ వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. బీజేపీ నాయ‌కుడైన కామినేని శ్రీ‌నివాస్ తెలుగుదేశం పార్టీతో అత్యంత సఖ్య‌త‌తో ఉంటున్నారు. బీజేపీకి చెందిన మ‌రో ఎమ్మెల్యే స‌హ‌చ‌ర మంత్రి అయిన మాణిక్యాల‌రావు కంటే కామినేని ఎక్కువ‌గా టీడీపీతో క‌లిసి మెల‌సి ఉండ‌టంతో ప‌లు వ‌ర్గాల్లో సందేహాలు మొద‌ల‌య్యాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న బీజేపీని వీడి టీడీపీలో చేరుతార‌ని అంచ‌నాలు జోరందుకున్నాయి.

మ‌రోవైపు ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారిన జ‌న‌సేన అధ్య‌క్షుడు - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో కూడా మంత్రి కామినేని జిగిరీ దోస్తీ ఉంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో గ‌తంలో స‌మావేశం నిర్వ‌హించ‌డంలో, ఇత‌ర‌త్రా సంద‌ర్భాల్లో కూడా మంత్రి ప‌వ‌ర్ స్టార్‌ తో త‌న అనుబంధాన్ని ఎక్క‌డా దాచుకోలేదు. ఈ నేప‌థ్యంలో మంత్రి కామినేని శ్రీ‌నివాస్ జ‌న‌సేన‌లో చేరవ‌చ్చున‌ని కూడా కొంద‌రు జోస్యం చెప్పారు. అయితే ఈ మాట ఆనోటా ఈనోటా..మంత్రిగారి చెవిన ప‌డిన‌ట్లుంది. స్వ‌యంగా ఆయ‌నే క్లారిటీ ఇచ్చేశారు. ఈ నెల 26న వెలగపూడి సచివాలయం వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పౌర సన్మానం చేయాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ త‌న పార్టీ ఫిరాయింపుపై సైతం స్ప‌ష్టత ఇచ్చేశారు.

తాను టీడీపీలో చేరుతాన‌ని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, జీవితాంతం బీజేపీలో ఉంటానని మంత్రి కామినేని శ్రీ‌నివాస్ ప్ర‌క‌టించారు. తాను ప్ర‌స్తుతం ఉన్న స్థాయికి చేరుకునేందుకు బీజేపీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కారణమ‌ని తెలిపారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌ గెలుపులో టీడీపీ - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల పాత్ర ఉందని మంత్రి అంగీక‌రించారు. త‌న‌కు ప్రజలు ఐదు సంవత్సరాల పాటు ప్రజాసేవకు అవకాశం కల్పించారని, వారితో కలిసే ఉంటానని స్ప‌ష్టం చేశారు. మరీ అరాచకంగా ఉండే వారితో తప్ప అందరితోనూ తాను సౌఖ్యంగా ఉంటాన‌ని మంత్రి కామినేని శ్రీ‌నివాస్ తెలిపారు.