Begin typing your search above and press return to search.

బీజేపీ మంత్రి టీడీపీలో చేరుతారా?

By:  Tupaki Desk   |   6 Aug 2017 9:43 AM GMT
బీజేపీ మంత్రి టీడీపీలో చేరుతారా?
X
ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోవ‌డం, రెండు రాష్ట్రాల్లో రెండు కొత్త ప్ర‌భుత్వాలు కొలువు దీర‌డం, ఆయా రాష్ట్రాల్లో త‌మ‌కు దీటైన స‌మాధానం చెప్పే స్థాయిలో విప‌క్షాలు ఉండ‌కూడ‌ద‌న్న కోణంలో ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర‌రావు - నారా చంద్ర‌బాబునాయుడులు ఆలోచించ‌డం, విప‌క్షాల ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలను లాగేయ‌డ‌మే ల‌క్ష్యంగా తెర‌పైకి వ‌చ్చిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ తో ఇరు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పార్టీ ఫిరాయింపులు చోటు చేసుకోవ‌డం జ‌రిగిపోయింది. ఈ దెబ్బ‌తో అటు తెలంగాణ‌లోని టీ టీడీపీ దాదాపుగా క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితి దాపురించ‌గా, ఏపీలో బ‌ల‌మైన విప‌క్షాన్ని బ‌ల‌హీనం చేసే దిశ‌గా చంద్ర‌బాబు చేసిన య‌త్నాలు కొంత‌మేర‌కు ఫ‌లించాయ‌నే చెప్పాలి.

ఎందుకంటే... వైసీపీ టికెట్ల‌పై మొన్న‌టి ఎన్నిక‌ల్లో గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు గోడ దూకేయ‌గా, వైసీపీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్సీలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ పై విప‌క్ష హోదాలో వైసీపీ గ‌ట్టిగానే పోరాడుతోంద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఈ క్ర‌మంలోనే టీడీపీని ఇరుకున పెట్టేందుకు త‌మ పార్టీలోకి వ‌చ్చిన టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్ర‌పాణిరెడ్డి చేత వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏకంగా ప్ర‌జా స‌మ‌క్షంలో బ‌హిరంగ స‌భ వేదిక‌గా రాజీనామా చేయించారు. ఇదంతా బాగానే ఉన్నా... ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు సంబంధించి ఇప్పుడు టీడీపీ కొత్త త‌ర‌హా పావుల‌ను క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది.

కేంద్రంలో అధికారం ద‌క్కించుకున్న ఎన్డీఏలోని కీల‌క భాగ‌స్వామి బీజేపీతో టీడీపీ మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు టీడీపీ ఎంపీలు మంత్రులుగా చేరిపోగా, న‌వ్యాంధ్ర‌లో టీడీపీ ఆధ్వ‌ర్యంలోని కేబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చేరిపోయారు. అయితే ఇటీవలి రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీకి దూరంగా ఉండాల‌ని బీజేపీ నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ద‌క్షిణాది రాష్ట్రాల్లో తాను బ‌లోపేతం కావాలంటే... టీడీపీతో బంధాన్ని తెంచుకోవాల్సిందేన‌న్న వాద‌న బీజేపీ నేత‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు కొన‌సాగుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెప్పేందుకు స‌సేమిరా అంటున్నారు.

ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు ఉంద‌ని, ఆ స‌మ‌యంలో అప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ముందుకు సాగుతామ‌ని బీజేపీ సుస్పష్టంగానే ప్ర‌క‌టించేసింది. ఈ క్ర‌మంలో టీడీపీ కొత్త త‌ర‌హా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు తెర తీసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల ప్ర‌కారం త‌న‌కు మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యేల‌ను కూడా పార్టీలో చేర్చుకునేందుకు చంద్ర‌బాబు సంసిద్ధంగానే ఉన్నార‌ట‌. ఇందులో భాగంగా కొన్ని వ‌ర్గాల ద్వారా లీకైన స‌మాచారం మేర‌కు... చంద్రబాబు కేబినెట్ లో కీల‌క శాఖ అయిన వైద్య‌ - ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌.

బీజేపీతో టీడీపీ మైత్రి చెదిరిపోతే... బీజేపీకి చెందిన కామినేనితో పాటు మ‌రో మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావు కూడా మంత్రి ప‌ద‌వుల‌ను కోల్పోవ‌డం ఖాయ‌మే. ఇదే జ‌రిగితే... కామినేనిని త‌న పార్టీలో చేర్చుకుని మంత్రిగా కొన‌సాగించేందుకు చంద్ర‌బాబు రెడీ ఉన్న‌ట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఆఫ‌ర్‌కు కామినేని కూడా త‌లూపిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే... ఏపీలో బ‌ల‌ప‌డదామ‌నుకుంటున్న బీజేపీకి, ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గలడం ఖాయ‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.