Begin typing your search above and press return to search.

విద్య అంటే డబ్బు మాత్రమేనా మంత్రిగారూ!

By:  Tupaki Desk   |   20 July 2017 10:05 AM GMT
విద్య అంటే డబ్బు మాత్రమేనా మంత్రిగారూ!
X
తరచిచూస్తే.. ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాల అవకతవకలూ వైద్యఆరోగ్య శాఖ చుట్టూతానే పరిభ్రమిస్తున్నట్లుగా కనిపిస్తోంది. శాఖానిర్వహణలో బోలెడన్ని లోపాలు బయటపడుతుండగా.. తల బొప్పి కడుతున్న మంత్రి కామినేని శ్రీనివాస్‌ కు అవి చాలవన్నట్లుగా.. తాజాగా కడప జిల్లాలోని ఫాతిమా వైద్యకళాశాల విద్యార్థుల వివాదం మెడకు చుట్టుకుంది. ఈ కళాశాలకు సంబంధించి దాదాపు వంద మందికి పైగా విద్యార్థుల వైద్యవిద్యాభ్యాసం ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పడింది. వీరి అడ్మిషన్లను ఎంసీఐ రద్దు చేయడంతో వారికి దిక్కు తోచకుండాపోయింది. ఈ విషయంలో ప్రభుత్వం చర్య తీసుకోవాలనే డిమాండ్ తో వారు ఆత్మాహుతులకు సిద్ధపడుతోంటే.. మంత్రిగారు మాత్రం.. ‘‘మేం చేయగలిగింది ఏమీ లేదు.. కావాలంటే కాలేజీ యాజమాన్యం నుంచి డబ్బు వెనక్కు ఇప్పిస్తాం’’ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

వైద్య విద్యలో చేరడం అంటేనే కోటి ఆశలతో వారు జాయిన్ అయి ఉంటారు. లక్షలాది రూపాయలు కేవలం అడ్మిషన్ ఫీజులు మాత్రమే కాకుండా ఇతరత్రా కూడా ఖర్చు చేసి ఉంటారు. అయితే.. ఇప్పుడు తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోవడంతో... విద్యార్థులు విలపిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే గనుక.. వారికి వేరే కళాశాలల్లో ఎడ్మిషన్లు ఇప్పించడం లాంటి వెసులుబాటు కల్పించే అవకాశం ఉందనేది కొందరి మాట. అయితే మంత్రిగారు మాత్రం అదేమీ పట్టించుకోవడం లేదు. ఎంసీఐతో మేం మాట్లాడం కానీ.. ఫలితం లేదు. విద్యార్థులకు కావాలంటే.. కాలేజీ యాజమాన్యం నుంచి వారు కట్టిన ఫీజు డబ్బులను వెనక్కు ఇప్పిస్తాం అని మాత్రం చెబుతున్నారు.

అయినా.. తానే స్వయంగా డాక్టర్ కూడా అయిన కామినేని శ్రీనివాస్.. వైద్య విద్య అంటే కేవలం ఫీజు డబ్బులు మాత్రమే అన్నట్లుగా చూస్తున్నారా? డబ్బు తిరిగి ఇప్పిస్తాం అని తేలిగ్గా చెప్పేయడం అంటే.. మరి సర్వనాశనం అయిపోయిన వారి భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైద్యవిద్యార్థుల విషయంలో ప్రభుత్వం స్పందన చాలా నామమాత్రంగా, నిర్లక్ష్యపూరితంగా ఉన్నదని.. విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అసలే వైద్య ఆరోగ్య శాఖ పనితీరు తీసికట్టుగా ఉన్నదని ప్రతిసారీ మందలిస్తూ.. తాను జోక్యం చేసుకుంటే తప్ప ఆ శాఖలో ఏ పనీ జరగడం లేదని చెబుతూ ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అయినా.. ఈ విషయంలో ఏమైనా జోక్యం చేసుకుని తమకు న్యాయం చేస్తారా? అని విద్యార్థులు ఆక్రోశిస్తున్నారు.