Begin typing your search above and press return to search.

బాబు మీద ఈగ వాలనివ్వని బీజేపీ మంత్రి

By:  Tupaki Desk   |   6 Feb 2018 11:09 PM IST
బాబు మీద ఈగ వాలనివ్వని బీజేపీ మంత్రి
X
ఏపీ బీజేపీ నేతల్లో కామినేని శ్రీనివాస్‌ ను చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడని అంటారు. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ కోసం పనిచేయడం ఆయన హాబీ అని చెప్తుంటారు. ఆ మాటలు నిజమే అనిపించేలా ఆయన ఈ రోజు మాట్లాడారు. ఏపీ సీఎం - తమ మిత్రపక్షం టీడీపీ అధినేత అయిన చంద్రబాబును ఎవరూ విమర్శించొద్దని.. అందులోనూ బహిరంగంగా ఆయన్నేమీ అనొద్దని తమ పార్టీ నేతలకు ఆయన సూచించారు.

కేంద్ర బడ్జెట్‌ లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమను విమర్శిస్తున్న టీడీపీ నేతల నోరు మూయించడానికా అన్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రివర్స్ అటాక్ చేశారు. రెండెకరాల రైతునని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబుకు లక్షల కోట్లు ఎలా వచ్చాయంటూ సోము వీర్రాజు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా సోము వీర్రాజు టీడీపీని - చంద్రబాబును ఉతికి ఆరేసిస్తున్నారు. ఆయన్ను ఎదుర్కోవడంలో టీడీపీ నేతలు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే బీజేపీ నేత - చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మిత్ర పక్షం గురించి ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని ఆయన అన్నారు.

మొదటి నుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న కామినేని తీరుపై ఆ పార్టీలోనూ నేతల్లో అసంతృప్తి ఉంది. తాజాగా ఆయన ఏకంగా బయటపడి సొంత పార్టీ నేతలనే తప్పు పట్టడంతో ఆయన బీజేపీ నేత కాదు టీజేపీ(టీడీపీ+బీజేపీ) నేత అంటూ విమర్శలు చేస్తున్నారు. మోదీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న చంద్రబాబును ఆయన వెనకేసుకు వస్తుండడంతో ఆయనపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని ఏపీ బీజేపీలోని ఒక వర్గం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.