Begin typing your search above and press return to search.

సిగ్గుతో తలదించుకుంటే పోయే పాపమేనా?

By:  Tupaki Desk   |   29 Aug 2015 5:49 AM GMT
సిగ్గుతో తలదించుకుంటే పోయే పాపమేనా?
X
పేరుకు ధర్మాసుపత్రే కానీ.. అక్షరాల అధర్మం తాండవించే మన ప్రభుత్వాసుపత్రులు ఎంత దారుణంగా పని చేస్తాయన్న విషయాన్ని తాజాగా గుంటూరు పెద్దాసుపత్రిలో ఎలుకలు పసివాడ్ని చంపేసిన ఘటన చెప్పకనే చెప్పేసింది.

ప్రభుత్వాసుప్రతిల్లో కుక్కలు.. పందులు.. ఎలుకలు.. పందికొక్కులు లాంటివి కొత్తకాకున్నా.. ఒకపసివాడ్ని పీక్కుతినేంతగా చేజారిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసే పరిస్థితి. జరిగిన ఉదంతంపై ఏపీ సర్కారు రియాక్ట్ అయ్యింది. జరిగిన ఘటనపై రాష్ట్ర ఆరోగ్యమంత్రిగారు సిగ్గుతో తలదించుకున్నానని చెప్పుకున్నారు. పెద్దమనసు చేసుకొని సారీ కూడా చెప్పేశారు.

పనిలో పనిగా.. ఈ ఘటనకు బాధ్యులయ్యారంటూ ఆసుపత్రిలోని ఉద్యోగులపై వేటేశారు. ఇక్కడితో తమ పని తాము చేశామన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించిందే తప్ప.. అంతకు మించి అన్న దగ్గర మాత్రం ఎలాంటి మాట లేకుండా పోయింది.

రోజుల పిల్లాడు ప్రభుత్వాసుపత్రిలో.. అది కూడా ఐసీయూ రూంలో ఉన్న చిన్నారిని పీక్కుతిన్నాయంటే.. అంతకుమించిన దారుణం ఇంకేం ఉంటుంది? రెండు క్షమాపణలు.. నాలుగు సస్పెన్షన్లతో ఒక కార్చక్రమం పూర్తి అయ్యిందన్నట్లుగా ఉందే తప్పించి.. బాబు సర్కారు ఎలాంటి చర్యల్ని ప్రకటించింది లేదు. దొరికిందే సందు అన్నట్లుగా.. కాంగ్రెస్.. వైఎస్సర్ కాంగ్రెస్ నేతలు.. చంద్రబాబు సర్కారుపై విరుచుకుపెడుతున్నారు. అయితే.. వీరిద్దరూ ప్రస్తావించని అంశాలెన్నో. చంద్రబాబు అధికారంలోకి వచ్చి కేవలం 15 నెలలు మాత్రమే. ఈ స్వల్ప వ్యవధిలోనే బాబు ఏదో ఊడబొడిచ్చేస్తాడనే ఆశలు ఎవరికి లేవు.

ఎందుకంటే.. చేతిలో కాసుల్లేని పరిస్థితితో పాటు.. నిత్యం ఏదో సమస్య మీద పడుతున్న వేళ.. ప్రభుత్వాసుపత్రుల్లో దారుణాల గురించి గుర్తించి.. ఆ లోపాల్ని సరిదిద్దే పరిస్థితి ఉందని చెప్పలేం. ఈ రోజు విమర్శలు చేస్తున్న వారంతా.. బాబు ముందు పాలించారన్న సంగతి మర్చిపోకూడదు. ఎలుకలకు ఎవరు సీఎం అని చూసుకొని కొరికేయవు కదా.

వాటి మంద భారీగా పెరిగే పరిస్థితితో అవి చెలరేగిపోయాయి. విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఎలుకల దండు ఆసుపత్రిలోఅత్యంత కీలకమైన.. అత్యవసర సేవలు అందించే ఐసీయూలో ఉండటం చూస్తే.. పాలకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఈ అంశంలో గత ప్రభుత్వాల తప్పులు.. ఇప్పుడు బాబుకు శాపంగా మారాయి. అలా అని బాబును సమర్థించటం కూడా తప్పే. ఎందుకంటే.. గత పాలకుల తప్పులతో విసిగిపోయి.. బాబును ముఖ్యమంత్రిని చేశారన్నది మర్చిపోకూడదు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కీలక రంగాల్లోని లోటుపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకొని ఉంటే బాగుంది. కానీ.. ఆయన దృష్టి ఇప్పుడు ఏపీ రాజధాని మీదనే ఉంది.

ఏపీకి రాజధాని కావాలి. కానీ.. అంతకుమించి అత్యంత కీలకఅంశాల మీద కూడా బాబు దృష్టి కేంద్రీకరించాలి. ఏపీ రాజధాని నిర్మాణం పేరుతో.. ఆసుపత్రుల్లో ఎలుకలు మనుషుల్ని చంపేసేంత దుస్థితి దిశగా రాష్ట్ర పాలన ఉండకూడదు. మరి.. ఇలాంటి ఘటనలకు సిగ్గుతో తలదించుకోవటం.. క్షమాపణలు సరిపోవు. ఇవేవీ పసివాడ్ని పోగొట్టుకున్న వారి కడుపుకోతను తీర్చవు. తరచూ సిగ్గుతో తలదించుకోవటం సమర్థపాలకులకు సరికాదన్న విషయాన్ని చంద్రబాబు అండ్ కో ఎప్పుడు గుర్తిస్తారో..?