Begin typing your search above and press return to search.

కామినేని : కమలానికి ఇంక సెలవు!

By:  Tupaki Desk   |   11 March 2018 11:06 AM GMT
కామినేని : కమలానికి ఇంక సెలవు!
X
భారతీయ జనతా పార్టీకి చెందిన కామినేని శ్రీనివాస్.. అధిష్టానం ఆదేశం మేరకు చంద్రబాబు కేబినెట్ లోంచి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన భాజపా ఎమ్మెల్యే మాత్రమే. కానీ వచ్చే ఎన్నికల సమయానికి ఆయన స్థితి గతులు ఏమిటి? భాజపానే నమ్ముకుని ఉంటే.. ఈ రాష్ట్రంలో మళ్లీ గెలిచే పరిస్థితి ఉందా? అనే అనుమానాలు రేగుతున్న నేపథ్యంలో కామినేని శ్రీనివాస్.. ఎన్నికల వేళ వచ్చే నాటికి భాజపాను వీడి పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.

చంద్రబాబునాయుడు భారతీయ జనతా పార్టీ మీద చేస్తున్న విషప్రచారం నేపథ్యంలో ఆ పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రలో ఒక్క ఓటైనా పడుతుందనుకోవడం అనుమానమే. పార్టీ కరడుగట్టిన కార్యకర్తలు కొందరు ఉండవచ్చు గానీ.. ప్రజల ఓట్లు మాత్రం పడే అవకాశం లేదు. అలాంటి పరిస్థితిలో భాజపా తరఫున పోటీచేయడానికి చాలా మంది నాయకులు మొగ్గు చూపకపోవచ్చునని అనుకుంటున్నారు. మరో కోణంలోంచి చూసినప్పుడు.. చంద్రబాబునాయుడు చాలాకాలంగా బెదిరిస్తున్నట్లుగా.. రాష్ట్రంలో కాంగరెస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి ఎదురైందో.. భాజపాకు కూడా అదే పరిస్థితి తప్పదని పలువురు అంటున్నారు.

కామినేని శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఈ కష్టాలన్నీ ఆయన పడదలచుకున్నట్లుగా లేదు. భాజపా ను నమ్ముకుని ఉంటే గెలవడం మాట అటుంచి.. సాంతం నష్టపోయే ప్రమాదమే ఎక్కువని ఆయన అనుకుంటున్నారు. అసలే తెలుగుదేశం అనుకూల కాషాయ మంత్రిగా ముద్ర ఉన్న ఆయన తెదేపాలో చేరడం కంటె.. పవన్ కల్యాణ్ జనసేనలో చేరడానికి మొగ్గు చూపుతున్నారని సమాచారం. నిజానికి పవన్ తో కామినేనికి చాలా కాలంగా సఖ్యత ఉంది.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే తొలుత పవన్ ను ఆశ్రయించిన కామినేని, ఆయన సూచన మేరకే చంద్రబాబుకు వద్దకెళ్లి.. అక్కడి సలహాతోనే భాజపాలో చేరి టికెట్ దక్కించుకున్నారనే ప్రచారం ఉంది. ఇప్పుడు మళ్లీ తన పాత మిత్రుడు పవన్ సరసకు చేరుతారన్నమాట. ఈ పరిణామం ఎన్నికల కంటె బాగా ముందుగా జరిగినా ఆశ్చర్యం లేదని కొందరంటున్నారు.