Begin typing your search above and press return to search.

కామినేని.. ‘చంద్ర’సేవే పరమావధి!

By:  Tupaki Desk   |   19 Feb 2018 10:45 AM GMT
కామినేని.. ‘చంద్ర’సేవే పరమావధి!
X
రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ.. తెలుగుదేశం పార్టీ అంటేనే అగ్గి మీద గుగ్గిలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మాటలు చెప్పడం ప్రారంభిస్తే.. ఏదో ఒక నాటికి ఏపీలో సొంతంగా పోటీచేయగల స్థాయి బలాన్ని సంతరించుకోవచ్చునని పార్టీ ముచ్చట పడుతోంటే.. ప్రస్తుత దుష్ప్రచారంతో... అలాంటి ఆశలకు పూర్తిస్థాయిలో గండికొట్టేసిన తెలుగుదేశం అంటే వారికి మంట పుట్టడం సహజమే. అందుకే కటీఫ్ కు రెడీ అని ప్రకటించేసి... మంత్రుల్ని కూడా రాజీనామాచేయిస్తాం అని అనేశారు.

కానీ భాజపాకు ఏపీలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో కామినేని శ్రీనివాస్ మాత్రం.. రాజీనామాకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీల తెగతెంపులు నిజమే అయితే గనుక.. కామినేని తెలుగుదేశం పార్టీలో చేరిపోయి.. మంత్రిగా కంటిన్యూ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. భాజపాను వదలిపెట్టి కామినేని గనుక.. చంద్రబాబు పంచన చేరితే.. ఆయనకు ఏదో ఒక విధంగా రాజకీయ భవిష్యత్తు కు హామీ ఆల్రెడీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

పదాధికారుల సమావేశం సమయంలో కామినేని శ్రీనివాస్ వ్యవహరించిన తీరు కూడా ఇలాంటి అనుమానాలు వ్యాపించడానికి కారణం అవుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలుగుదేశం మీదనే అందరూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వంనుంచి వైదొలగడం, మద్దతు ఉపసంహరణ - మంత్రుల రాజీనామాలు అనే టాపిక్ చర్చకు వచ్చినప్పుడు మంత్రి పైడికొండ మాణిక్యాల రావు.. తాను తక్షణం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అక్కడికక్కడే ప్రకటించారుట. కానీ ఆ సమయానికి కామినేని మాత్రం చర్చలోనే ఉండకుండా లేచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ వైఖరికి కామినేని వివరణ ఇచ్చుకుంటూ.. సమావేశం నుంచి బయటకు వెళ్లడానిక తన అనారోగ్య పరిస్థితులే కారణం అని చెప్పుకున్నారు. అయితే ఆయన వెళ్లిపోవడానికి చంద్రభక్తే కారణం అని పలువురు అంటున్నారు. చంద్రబాబు కేబినెట్ లో తెలుగుదేశం వారికంటె ఎక్కువగా చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నది కామినేనికే అని... ఆయన భాజపాను అయినా వీడుతారేమో గానీ.. చంద్రసేవను వదలుకోరని పలువురు అంచనా వేస్తున్నారు.