Begin typing your search above and press return to search.

బాబుపై సొంత మ‌నుషులే ర‌గిలిపోతున్నారట‌

By:  Tupaki Desk   |   4 April 2017 5:28 AM GMT
బాబుపై సొంత మ‌నుషులే ర‌గిలిపోతున్నారట‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తాలుకు సెగ‌లు ఇంకా రేగుతూనే ఉన్నాయి. టీడీపీ అధ్య‌క్షుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ల‌క్ష్యంగా విమ‌ర్శ‌ల జోరు పెరుగుతోంది. ఈ జాబితాలో ఇన్నాళ్లు పార్టీ నేత‌లు, సీనియ‌ర్లు ఉండ‌గా తాజాగా ఇందులోకి ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు చేరారని స‌మాచారం. శాఖల కేటాయింపులో తమకు జరిగిన అన్యాయం, అవమానంపై కమ్మ సామాజికవర్గం ఆగ్రహంతో రగిలిపోతుందని అంటున్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న తమ వర్గీయులను మంత్రివర్గంలోకి తీసుకోకుండా, తిరిగి శాఖల కేటాయింపులోనూ తమ వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులకు అప్రాధాన్యమైన శాఖలు ఇవ్వడంపై కమ్మ సామాజికవర్గం అసంతృప్తితో ఉందని వార్త‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా జరిపిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో సంఖ్యకు తగినన్ని పదవులివ్వకపోవడంపై కమ్మ సామాజికవర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని వారు పార్టీ పెద్దల వద్దే వ్యక్తం చేస్తుండటం ప్రస్తావనార్హం. ప్రధానంగా కోస్తా, అనంతపురం జిల్లాలకు చెందిన కమ్మ వర్గ నేతలు బాబు-లోకేష్ కలసి తీసుకున్న నిర్ణయాలపై పెదవి విరుస్తున్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో సర్వం నష్టంపోయిన తమను ప్రోత్సహించేందుకు బదులు చంద్రబాబు ఇతర వర్గాలను చూసి భయపడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు-లోకేష్ చుట్టూ ఉన్న పారిశ్రామికవేత్తలు, అధికారులైన కొందరు కమ్మ వారికే తప్ప, క్షేత్రస్థాయిలో జెండా మోసిన వారికి గుర్తింపు దక్కలేదన్న ఆవేదన ఆ వర్గంలో వ్యక్తమవుతోంది. ఆసక్తిక‌రంగా ఇప్పటివరకూ రాజీనామాలు ప్రకటించిన పార్టీ సీనియ‌ర్లు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, చింతమనేని ప్రభాకర్, అలక వహించిన ధూళిపాళ్ల న‌రేంద్ర‌, అసంతృప్తితో ఉన్న ప‌య్యావుల‌ కేశవ్ తదితరులంతా అదే సామాజికవర్గం కావడం ప్రస్తావనార్హం. మిగిలిన సామాజికవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా వారెవరూ రోడ్డెక్కలేదు. కేవలం వాళ్లిద్దరూ ఉంటే సరిపోతుందా? అంటూ తాజాగా సోషల్‌మీడియాలో ఆ సామాజికవర్గం తన అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండటం ప్రస్తావనార్హం.

పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారని త‌మ సామాజిక వ‌ర్గ నేత‌లు ఎంతో న‌ష్ట‌పోయార‌ని గుర్తు చేస్తున్నారు. పార్టీ సీనియ‌ర్లైన కరణం బలరాం - గోరంట్ల బుచ్చయ్యచౌదరి - ధూళిపాళ్ల నరేంద్ర - పయ్యావుల కేశవ్ - యరపతినేని శ్రీనివాసరావు - ఆలపాటి రాజా - వెలగపూడి రామకృష్ణబాబు వంటి నేతలను ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్తున్నారు. వారిలో రెండు, మూడుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉన్నప్ప‌టికీ లైట్ తీసుకొని మంత్రి పదవుల్లో వీరెవరినీ కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలలో ఐదు శాతం ఉన్న రెడ్లకు నాలుగు మంత్రి పదవులివ్వడంతోపాటు, వారికి కీలక శాఖలివ్వడంపైనా కమ్మ వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాఖల కేటాయింపులో కూడా తమ వర్గం పట్ల వివక్ష ప్రదర్శించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిటాల సునీతకు పౌరసరఫరాల శాఖ తప్పించి ప్రాధాన్యం లేని మహిళా సాధికారికత, శిశు సంక్షేమం, వృద్ధుల సంక్షేమం; పత్తిపాటి పుల్లారావును వ్యవసాయశాఖ నుంచి తప్పించి ధరల నియంత్రణ వంటి శాఖలివ్వడంపై పెదవి విరుపు వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/