Begin typing your search above and press return to search.

కనకమేడల - సీఎం రమేష్ ఫైనల్ : ఆశలు హుళక్కి!

By:  Tupaki Desk   |   11 March 2018 10:19 AM GMT
కనకమేడల - సీఎం రమేష్ ఫైనల్ : ఆశలు హుళక్కి!
X
చంద్రబాబునాయుడు తమ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీ లుగా కాబోతున్న వారెవ్వరో పేర్లు ప్రకటించేశారు. పార్టీకి ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ,... ఢిల్లీ లాబీయింగ్ లో తెరవెనుక పాత్రలను పోషించడంలో సిద్ధహస్తుడిగా ముద్ర ఉన్న సీఎం రమేష్ కు రెండోసారి చంద్రబాబు అవకాశం కల్పించారు. సీఎం రమేష్ పదవీకాలం ఇప్పుడు పూర్తవుతోంది. ఆయనకు మళ్లీ చాన్సు దక్కుతుందనే ప్రచారం చాలా కాలంగా ఉంది. అంతా అనుకున్నట్లే చంద్రబాబు సెకండ్ చాన్స్ ఇచ్చారు. కాగా, పార్టీకి చాలా కాలంగా ఉపయోగపడుతున్న నాయకుడు కనకమేడల రవీంద్రకుమార్ కు ఎంపీ అయ్యే అవకాశం దక్కింది.

ఉన్న రెండు సీట్లలో ఒకటి అగ్ర వర్ణాలకు - మరొకటి దళిత - బీసీ వర్గాలకు ఇస్తానని చంద్రబాబు ముందునుంచి ప్రకటించారు. దీంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ మాట ఆయన పాటించలేకపోయారు. కులాల సమీకరణాల పరంగాచూస్తే.. సీఎం రమేష్ వెలమ వర్గానికి చెందిన వ్యక్తి... కనకమేడల రవీంద్రకుమార్ కమ్మ వర్గానికి చెందిన నాయకుడు.

నిజానికి ఈ పదవి కోసం.. కమ్మ వర్గానికి చెందిన కంభంపాటి రామ్మోహన్ , మరో పత్రికాధిపతి కూడా ప్రయత్నాలు చేసినట్లు పుకార్లు వచ్చాయి. కంభంపాటి అయితే ఏకంగా అమరావతిలోనే తిష్టవేసి లాబీయింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరోవైపు పార్టీమీద కమ్మముద్ర ఎటూ ఉన్నది గనుక.. దాన్ని తప్పించుకోవడానిక రెడ్డి వర్గానికి ఇస్త బాగుంటుందనే చర్చ కూడా వచ్చింది. కడప జిల్లాకు చెందిన రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డిని బరిలోకి దించుతారనే ప్రచారం జరిగింది. ఎవరెన్ని చేసినా.. చిట్టచివరికి సీఎం రమేష్ లాబీయింగ్ ముందు నిలువలేకపోయారనే చెప్పాలి. పైగా కనకమేడల రవీంద్రకుమార్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.

సహజంగానే చంద్రబాబు ప్రకటించిన పేర్లు కొందరికి అసంతృప్తి కలిగిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే.. ఒకటో సారి ఛాన్స్ దక్కని సీనియర్ నేతలే పార్టీలో బోలెడు మంది ఉండగా.. సీఎం రమేష్ కు రెండోసారి ఛాన్సు ఇవ్వడం కొందరికి నచ్చడం లేదు. అలాగే రెండో సీటు విషయంలో కూడా.. ఆశించిన బీద మస్తాన్ యాదవ్, జూపూడి ప్రభాకర్, వర్లరామయ్య లాంటి వారికి భంగపాటు తప్పలేదు.