Begin typing your search above and press return to search.

బ్రాహ్మణులకు సారీ చెప్పిన ఐలయ్య

By:  Tupaki Desk   |   17 May 2016 6:43 AM GMT
బ్రాహ్మణులకు సారీ చెప్పిన ఐలయ్య
X
రెండు రోజుల కిందట విజయవాడలో బ్రాహ్మణులను - హిందూ మతాన్ని - హిందూ దేవుళ్లను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన జాతీయ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ కంచె ఐలయ్య సారీ చెప్పారు. బ్రాహ్మణులపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. విజయవాడ కేంద్రంగా రెండు రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బ్రాహ్మణులపైనే కాక హిందూ దేవుళ్లపైనా ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

బ్రాహ్మణులు అంటే సోమరిపోతులని ఐలయ్య అనడం వివాదానికి దారి తీసంది. ఆ వ్యాఖ్యలపై మొన్న ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ - బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమరులుగా ఉన్న బ్రాహ్మణుల అడ్రెస్ లు చెబితే వారిని దండిస్తామని... సోమరులైన బ్రాహ్మణుల అడ్రస్ లు చెప్పాలని ఐలయ్యను ఉద్దేశించి అన్నారు. ఆ తరువాత తాజాగా నిన్న కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఐలయ్యను కలిసిన బ్రాహ్మణులు తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఐలయ్య అక్కడికక్కడే వారికి క్షమాపణలు చెప్పారు.

బ్రాహ్మణిజానికి మాత్రమే తాను వ్యతిరేకినని, బ్రాహ్మణులకు కాదని ఐలయ్య పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు నొప్పించి ఉంటే మన్నించాలని ఆయన బ్రాహ్మణులను కోరారు. బ్రాహ్మణుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని కూడా ఆయన ప్రకటించారు. తాను చేయని వ్యాఖ్యలను ఓ తెలుగు దినపత్రిక రాసిందని పేర్కొంటూ తప్పంతా పత్రికలపైకి నెట్టేశారు. అయితే, ఐలయ్య గతాన్ని చూసినవారంతా మాత్రం ఆయన ఆ వ్యాఖ్యలు చేసే ఉంటారని భావిస్తున్నారు.

మరోవైఫు ప్రొఫెసర్ ఐలయ్య తనపై ఆగ్రహిస్తున్న బ్రాహ్మణులను తెలివిగా బోల్తా కొట్టించారని... తాను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదని, బ్రాహ్మణిజానికి మాత్రమే వ్యతిరేకమని చెప్పి మాయ చేశారని అంటున్నారు. పులుసు వేరు - పులుసులో ముక్క వేరు కాదన్నట్లే... బ్రాహ్మణులు - బ్రాహ్మణిజం మధ్య పెద్దగా తేడా ఏమీ ఉండదన్న సత్యం తెలిసి కూడా ఐలయ్య తెలివిగా మాట్లాడి తప్పించుకున్నారని అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా మేధావులుగా పేరు తెచ్చుకున్న వారు, సమాజాన్ని చదివిన వారు కూడా కులాల పేరుతో మాట్లాడుకుంటూ నిత్యం వివాదాలకు తెరతీయడం.. కులాలను వ్యతిరేకించడం వంటి అంశాలపై తటస్థ భావజాలమున్నవారంతా మండిపడుతున్నారు.