Begin typing your search above and press return to search.

ప‌నిలేనోళ్లు..పాట‌గాళ్లే నాపై రాళ్లేస్తారు:ఐల‌య్య

By:  Tupaki Desk   |   14 Oct 2017 4:42 AM GMT
ప‌నిలేనోళ్లు..పాట‌గాళ్లే నాపై రాళ్లేస్తారు:ఐల‌య్య
X
కంచె ఐల‌య్య‌.. వివాదాల‌కు పెట్ట‌ని పేరు! ఆయ‌న ఏం మాట్లాడినా అందులో ఏదొ ఒక వివాదం, ఆయ‌న ఏం రాసినా ఏదో ఒక వివాదం. గ‌తంలో బ్రాహ్మ‌ణులు - త‌ర్వాత గోవులు.. ఇప్పుడు వైశ్యులు! ఆయ‌న టార్గెట్ ఏమిటి? అంటే చెప్ప‌డం తేలికే అంటారు ఆయా సామాజిక వ‌ర్గాల వారు. కానీ, ఆయ‌న మాత్ర డామిట్‌-మీరు న‌న్ను అర్ధం చేసుకోలేరు! అంటూ భీష్మిస్తారు. మ‌రో అంబేద్క‌ర్‌ ను ప్ర‌శ్నిస్తారా అంటారు. మీక‌స్స‌లు నాతో చ‌ర్చించే స్థాయే లేదంటారు. ఇటీవ‌ల పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల‌ను కుదిపేసిన ఆయ‌న పుస్త‌కం సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్ల వివాదానికి దాదాపు తెర‌ప‌డింది. సుప్రీం కోర్టు.. భావ ప్ర‌క‌ట‌న కింద ప్రొఫెస‌ర్ రాసిన పుస్త‌కాన్ని నిషేధించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది.

అయితే,ఇలా సుప్రీం తీర్పుపై సినీ ర‌చ‌యిత‌ - క‌వి జొన్న‌విత్తుల ప‌రోక్షంగా ఐల‌య్య‌తో ఆడేసుకున్నారు. ఇది ఐల‌య్య‌కు బాగా మంట‌పుట్టించింది. దీంతో ఆయ‌న కూడా జొన్న‌విత్తుల‌పై మండిప‌డ్డారు. ప‌నిలేనోళ్లు, పాట‌లు రాసేటోళ్లే.. త‌న‌ను విమ‌ర్శిస్త‌రు అంటూ కామెంట్ల‌తో కుమ్మేశారు. తాను రాసిన పుస్త‌కంలో బేసిక్ ఇష్యూ దేవుళ్ల‌కి సంబంధించింది కాదని, ఇది హిందూ మతం గురించి వివ‌రించిన‌ పుస్తకం కానే కాదని ఐల‌య్య అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌... ``అస‌లు స‌మ‌స్య ఎక్క‌డ వ‌స్తోందంటే, సినిమా ర‌చ‌యిత‌లు, జొన్న‌విత్తుల వంటి సినిమా పాట‌లు రాసుకునేవారు, పీఠాధిప‌తులు మాత్ర‌మే నా పుస్త‌కంపై అభ్యంత‌రక‌ర‌ వ్యాఖ్య‌లు చేస్తూ వ్యతిరేకిస్తున్నారు`` అని అన్నారు.

అదేస‌మ‌యంలో ఈ దేశంలోని ఇన్ని యూనివ‌ర్సిటీల్లోని ప్రొఫెస‌ర్లు - ప‌రిశోధ‌న చేసే విద్యార్థులు ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని ఐలయ్య నిల‌దీశారు. సినిమా పాట‌లు రాసుకునే వారు, త‌న‌ పుస్తకాన్ని వ్య‌తిరేకించే వారు ఇప్పుడు దేశంలోని అత్యున్న‌త న్యాయ‌స్థానమైన సుప్రీంకోర్టు చెప్పిన నిర్ణ‌యాన్ని కూడా త‌ప్ప‌ని వ్యాఖ్యానిస్తున్నార‌ని విరుచుకుప‌డ్డారు. ఇలాంటి ప‌నిలేనోళ్ల‌తోటి త‌న‌కు సాప‌త్యం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఇటువంటి వారితో తాను చర్చ‌లో పాల్గొనాలా? అని ఎద్దేవా చేశారు. మొత్తానికి మ‌ళ్లీ ఐల‌య్య కామెంట్లు అదిరాయ‌ని అనిపించాయి. దీనిపై వైశ్య సంఘాలు ఏమంటాయో చూడాలి.