Begin typing your search above and press return to search.

అవును.. ఐల‌య్య అంత‌లేసి మాట‌లు అనేశారు

By:  Tupaki Desk   |   15 May 2016 9:52 AM GMT
అవును.. ఐల‌య్య అంత‌లేసి మాట‌లు అనేశారు
X
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే వారికి ఈ రోజుల్లో కొద‌వ‌లేదు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌లువురు నేత‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ స్పందించ‌టం ఒక ఎత్తు అయితే..కొంద‌రు మేధావులు త‌మ వాద‌న‌ను వినిపించే ప్ర‌య‌త్నంలో ప‌లు వివాదాస్ప‌ద అంశాల్ని తెర మీద‌కు తీసుకొస్తుంటారు. ద‌ళితుల ప‌క్ష‌పాతిగా.. ఆదివాసీల గొంతుక తానై వ్య‌వ‌హ‌రించే కంచె ఐల‌య్య వాద‌న కొన్ని సంద‌ర్భాల్లో చాలా చిత్రంగా ఉంటుంది. పురాణాల్లో రాక్ష‌సులుగా అభివ‌ర్ణించిన వారంతా ఆదివాసీలుగా ఆయ‌న చెబుతారు. అస‌లు.. నిజంగా జ‌రిగిందో లేదో తెలీని అంశాలను ప‌ట్టుకొని.. అందులోని పాత్ర‌ల‌కు కులాలు.. వ‌ర్గాలు ఆపాదించేసి ఆ వ‌ర్గానికి అన్యాయం జ‌రిగింద‌ని చెప్ప‌టం అపోహ‌ల్ని పెంచ‌ట‌మే అవుతుంది. కొన్ని వంద‌ల ఏళ్ల క్రితం కొన్ని వ‌ర్గాల‌ను నాటి ఆగ్ర‌వ‌ర్ణాల వారు తీవ్రంగా అవ‌మానించారంటూ చిత్ర‌మైన వాద‌న‌ను వినిపిస్తారు.

ఐల‌య్య మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే కొన్ని వంద‌లో.. వేల ఏళ్ల క్రితం అలా జ‌రిగిందో లేదో అన్న‌ది తెలీదు. ఆయ‌న వాద‌న‌ల‌కు త‌గ్గ‌ట్లుగా ఆధారాలు.. సాక్ష్యాలు ఉండ‌వు. ఇక్క‌డ మ‌రో పాయింట్ ఉంది. ఈ రోజు ఇంత నాగ‌రిక‌త పెరిగి.. మేధావులు అనుకునే ఐల‌య్య లాంటి వారు స‌మాజంలోని వ‌ర్గాల మ‌ధ్య అస‌మాన‌త‌ల్ని త‌గ్గించే క‌న్నా.. పెరిగేలా ప్ర‌య‌త్నించే నేప‌థ్యంలో.. కొన్ని వేల ఏళ్ల కిందటి మ‌నిషి ఆలోచ‌న ఏమిటి? వారి మైండ్ సెట్ ఏమిట‌న్న‌ది ఆలోచించిన‌ప్పుడు.. నాడు ఏదో జ‌రిగితే.. దాన్ని నేడు ప్ర‌స్తావించి కొన్ని వ‌ర్గాల వారిని రెచ్చ‌గొట్ట‌టం.. మ‌రికొన్ని వ‌ర్గాల వారిని త‌న మాట‌ల‌తో చిన్న‌బుచ్చ‌టంలో అర్థ‌మేమైనా ఉందా?

రామాయ‌ణం.. మ‌హాభార‌తంలోని పాత్ర‌లు.. వారి తీరు తెన్నుల్ని నేటి సామాజిక ప‌రిస్థితుల‌కు లింకు పెడుతూ చేసే వ్యాఖ్య‌ల వ‌ల్ల క‌లిగే న‌ష్టం ఏమిటంటే.. ఆయా వ‌ర్గాల వారు తీవ్ర ప్ర‌భావానికి గురి అవుతుంటారు. ఇలాంటివి కొంత‌కాలానికి స‌మాజంలో కొత్త ఆశాంతికి దారి తీస్తుంద‌నటంలో సందేహం లేదు. త‌మ మాట‌ల‌తో స‌మాజానికి జ‌రిగే న‌ష్టం గురించి ప‌ట్టించుకోని కంచె ఐల‌య్య లాంటి వారు.. తాము చెప్పాల్సింది చెప్పేస్తూ.. వ‌ర్గాల మ‌ధ్య అస‌మాన‌త‌ల్ని పెంచుతున్నార‌న్న విమ‌ర్శ ఉంది.

ఎప్పుడో.. ఎక్క‌డో.. జ‌రిగిన‌ట్లుగా చెప్పే పురాణాల శాస్త్రీయ‌త మీద‌నే చాలా సందేహాలు ఉన్నాయి. అలాంట‌ప్పుడు ఆయా అంశాల్ని ప్ర‌స్తావిస్తూ.. కొన్ని వ‌ర్గాల వారిని అవ‌మానించేలా విమ‌ర్శ‌లు చేయ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో ఐల‌య్య లాంటి వారే చెప్పాలి. బ్రాహ్మ‌ణుల మీద త‌ర‌చూ విరుచుకుప‌డే ఐల‌య్య ఆయా వ‌ర్గాల వారిని త‌న మాట‌ల‌తో నొప్పించే క‌న్నా.. తాను గొంతుకై నిలిచే వారికి జ‌రిగే అన్యాయాల మీద గ‌ళం విప్పితే బాగుంటుంది. మేధావులు ఒక చ‌ట్రంలో చిక్కుకుపోవ‌టం వ‌ల్ల జ‌రిగే న‌ష్టం ఏమిటంటే.. వారు అందులో నుంచి బ‌య‌ట‌కు రారు. తాము చేసే ప్ర‌తి వాద‌న‌ను ఆ కోణం నుంచే చూస్తుంటారు. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఐల‌య్య చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల్నే చూస్తే..

= బ్రాహ్మ‌ణులు తిని కూర్చునే సోమ‌రులు.

= హిందూ ఆరాధ్య దైవాలైన శ్రీకృష్ణుడు.. రాముడు దేవుళ్లు ఎందుకు అవుతారు?

= బ‌హుభార్యాత‌త్వం ఉన్న శ్రీకృష్ణుడు ఆద‌ర్శ‌పురుషుడు ఎలా అయ్యాడు?

= ఆదివాసీల నాయ‌కురాలైన తాట‌కిని చంపిన రాముడు..అంద‌గ‌త్తె అయిన శూర్ప‌ణ‌ఖ ముక్కు చెవులు కోసిన ల‌క్ష్మ‌ణుడు ఎలా ఆద‌ర్శ వంతులు?

= వేదాల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేదు

= న‌వ్యాంధ్ర రాజ‌ధానికి అమ‌రావ‌తి అన్న పేరు పెట్టారు. అది బుద్ధుడికి సంబంధించింది. ఆర్ ఎస్ఎస్ కు బుద్ధుడికి అస్స‌లు ప‌డ‌దు. అందుకే.. అమ‌రావ‌తికి నీళ్లు.. మ‌ట్టి ఇచ్చి మోడీ ఊరుకున్నారు.

= అమ‌రావ‌తి అన్న పేరుతో శంకుస్థాప‌న చేసిన చోటు బుద్ధుడి విగ్రహం ఎందుకు పెట్ట‌లేదు?