Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   29 Dec 2022 12:06 PM GMT
చంద్రబాబుపై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు!
X
టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మండిపడ్డారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభకు 50–60 వేల మంది జనం వచ్చారని.. వీరందరినీ మందు, ముక్క, బిర్యానీలు ఇచ్చి పశువులను తోలినట్టు తోలారని నిప్పులు చెరిగారు. రెండు వేల మంది కూడా పట్టని ప్రాంతంలో వేల మందితో రోడ్‌ షో ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఎనిమిది మంది ప్రాణాలు పోవడానికి చంద్రబాబుదే బాధ్యత అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 50 వేలు.. రూ. లక్ష అంటూ చంద్రబాబు చదివితే సరిపోతుందా అని కేఏ పాల్‌ ప్రశ్నించారు.

చంద్రబాబు కొడుకు.. మనవడు ప్రాణాలకు కూడా ఇదే విలువ ఇస్తారా..? అని కేఏ పాల్‌ నిలదీశారు. చంద్రబాబు బిడ్డల ప్రాణాలకు లక్షల కోట్ల విలువా..? మా బడుగుల ప్రాణాలకు విలువ లేదా..? అని కేఏ పాల్‌ ధ్వజమెత్తారు. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైన చంద్రబాబుపై హత్య కేసు నమోదు చేయాలని కేఏ పాల్‌ డిమాండ్‌ చేశారు.

నైతిక బాధ్యత వహించి చంద్రబాబు టీడీపీకి రాజీనామా చేయాలని కేఏ పాల్‌ డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలకు ఇప్పటికైనా బుద్జి వచ్చిందా..? రూ. 250 బిర్యాని పొట్లానికి ఎగబడతారా..? అంటూ కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై హత్య కేసు నమోదు చేసేందుకు పోలీసులకు 72 గంటల సమయం ఇస్తున్నానని పాల్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

లేకుంటే కందుకూరు ఘటనపై కోర్టుకు వెళ్తామని కేఏ పాల్‌ చెప్పారు. చంద్రబాబు మీటింగులకు పోలీసులు అనుమతివ్వకూడదన్నారు. చంద్రబాబు దోచుకున్న ప్రజాధనం రూ. 6 లక్షల కోట్లు ఉందని చెప్పారు. ఏపీలోని పేదలకు రూ. 2 లక్షల చొప్పున తన అవినీతి ధనాన్ని పంచి పెట్టొచ్చుగా..? అని ప్రశ్నించారు.

చంద్రబాబును హౌస్‌ అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టాలని కేఏ పాల్‌ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సభలకు అనుమతిస్తే డీజీపీ పైనా కేసు వేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు కేఏ పాల్‌ కందుకూరులో పర్యటించారు. మృతుల కుటుంబాల పిల్లలను తన చారిటీ సంస్థల్లో చదివిస్తానని హామీ ఇచ్చారు. కందుకూరు పోలీసు స్టేషన్‌ లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.