Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌కు షాక్‌...వైసీపీలోకి జిల్లా అధ్య‌క్షుడు

By:  Tupaki Desk   |   9 Dec 2016 5:10 PM GMT
కాంగ్రెస్‌కు షాక్‌...వైసీపీలోకి జిల్లా అధ్య‌క్షుడు
X
ఏపీలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ట్లు క‌నిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ మ‌రో షాక్ ఎదురయింది. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ వైసీపీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఈనెల 12న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. రాజమండ్రి రూరల్‌ కార్యకర్తలతో సమావేశమైన కందుల వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యకర్తలంతా కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరాలని సూచించారు. దీంతో కందుల వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

రాష్ట్ర విభజన త‌ర్వాత స‌మ‌ర్థుడైన నాయ‌కుడికి ప‌గ్గాలు అప్ప‌గించేందుకు వెతుకుతున్న క్ర‌మంలో కందుల దుర్గేష్‌కు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్ప‌గించింది. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ద్వారా పార్టీ ఉనికిని చాటడంలో కొద్దిమేర సఫలమయ్యారు. అయితే కార్య‌క‌ర్త‌ల ఒత్తిడి మేర‌కు ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మాత్రమే చెప్పుకోదగ్గ నేతగా ఉన్నారు.

ఇదిలాఉండ‌గా... కాపు సామాజికవర్గానికి చెందిన కందుల దుర్గేష్‌కు రాజమండ్రి రూర‌ల్లో మంచి పట్టు ఉంది. కందుల దుర్గేష్ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తుండడంతో ఇక తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ ఉనికి కోల్పోయినట్టేనని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే కందుల దుర్గేష్ హైదరాబాద్‌లో జగన్‌తోనూ సమావేశమయ్యారు. కందుల గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. కొన్ని నెలల కిందట కర్నూలు జిల్లాకు చెందిన‌ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పార్టీని వీడిన విషయం తెలిసిందే. మరికొంత మంది సీనియర్లు సైతం కాంగ్రెస్‌ను వీడే అవకాశముందన్న ప్రచారం ఆనాడే సాగింది. అది నిజం అవుతుంద‌న్న‌ట్లుగా ఏపీ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న కందుల దుర్గేష్‌ సైతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్దమయ్యారు. దీంతో సీనియ‌ర్ల‌ జంపింగ్‌ల నేపథ్యంలో పార్టీని బతికించుకొనేదెలా అన్న సందిగ్దతలో కాంగ్రెస్‌ నాయకత్వం పడింది.