Begin typing your search above and press return to search.

వైసీపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌

By:  Tupaki Desk   |   27 Nov 2016 7:06 AM GMT
వైసీపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌
X
ఏపీలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ట్లు క‌నిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ మ‌రో షాక్ ఎదుర‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. కొన్ని నెలల కిందట కర్నూలు జిల్లాకు చెందిన‌ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పార్టీని వీడిన విషయం తెలిసిందే. మరికొంత మంది సీనియర్లు సైతం కాంగ్రెస్‌ ను వీడే అవకాశముందన్న ప్రచారం ఆనాడే సాగింది. అది నిజం అవుతుంద‌న్న‌ట్లుగా ఏపీ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న కందుల దుర్గేష్‌ సైతం ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. దీంతో సీనియ‌ర్ల‌ జంపింగ్‌ ల నేపథ్యంలో పార్టీని బతికించుకొనేదెలా అన్న సందిగ్దతలో కాంగ్రెస్‌ నాయకత్వం పడింది.

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం పాలైనప్ప‌టికీ కొంద‌రు సీనియర్‌ నేతలు పార్టీని అంటుపెట్టుకొని ఉండటంతో కనీసం వచ్చే ఐదేళ్ల కాలంలోనైనా పార్టీని బలోపేతం చేసుకొని తన ఉనికిని చాటుకోవాలని ఏపీ కాంగ్రెస్‌ నాయకత్వం భావించింది. పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు రుణమాఫీతోపాటు ఏపీకి ప్రత్యేకహోదా అంశం ఇతర అంశాలపైనా టీడీపీ సర్కార్‌పై ఏపీ కాంగ్రెస్‌ పోరాటం చేస్తోంది. అయితే అక్కడక్కడ పార్టీపరంగా జరుగుతున్న కార్యక్రమాలకు తప్పా మెజార్టీగా సీనియర్‌ నేతలు ఎవరూ ఏపీ కాంగ్రెస్‌ లో చురుకైన పాత్ర పోషించడంలేదన్న విమర్శలు ఆ పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన సీనియర్‌ నేతలు ఇప్పుడు అడపదడఫా తప్ప మీడియా ముందుకు సైతం రావడంలేదు. దీంతో ఏపి కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పార్టీకి ఏకైక బలంగా ఉన్న సీనియర్‌ నేతలే పార్టీని వీడిపోతుంటే మున్ముందు పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముం దని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

దక్షిణాధి రాష్ట్రాలపై దృష్టిసారించిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఏపిలో పార్టీ ఉనికిని కాపాడేందుకు ప్రత్యేక దృష్టిసారించింది. పార్టీ సీనియర్‌ నేతల ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావించింది. కానీ తనకు పట్టుగొమ్మలుగా ఉన్న పార్టీ సీనియర్‌ నేతలు ఒక్కోక్కరుగా పార్టీని వీడ టంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ లోనూ కలవరం మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే పార్టీలోని మెజార్టీ సీనియర్‌ నేతలు టిడిపిలోకి - వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం కూడా ఉభయ గోదావరి జిల్లాలో బలమైన నేతగా ఉన్న వారు మెజార్టీగా పార్టీని వీడి ఇతర పార్టీలలోకి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమయం దగ్గరపడేకొద్ది ఇంకెంతమంది పార్టీని వీడుతారన్న ఆందోళనకు కాంగ్రెస్‌ నాయకత్వం గురవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధిష్ఠానం పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్‌ నేతలతో నిరంతరం చర్చిస్తూ వారు పార్టీని అంటిపెట్టుకొని ఉండేలా చేయాలని హైకమాండ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/