Begin typing your search above and press return to search.

శశిథరూర్ లాంటోడ్ని ఏం చేయాలి?

By:  Tupaki Desk   |   22 March 2016 6:02 AM GMT
శశిథరూర్ లాంటోడ్ని ఏం చేయాలి?
X
దేశవాసులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. తమ అల్ప రాజకీయం కోసం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దేశ ప్రజల్ని ఇబ్బందికి గురి చేయటమే కాదు.. తరచూ భావోద్వేగాలకు గురయ్యేలా చేస్తోంది. అలా అని.. చూస్తూ ఊరుకుండిపోతే.. వారి మాటల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోవటమే కాదు.. కొన్నేళ్ల తర్వాత ఇలాంటి వారి మాటలే చరిత్రగా మిగిలిపోయే దుస్థితి. ఇంతకీ.. మాజీ కేంద్రమంత్రి.. కాంగ్రెస్ నేత శశిథరూర్ ఇప్పుడేమన్నారన్న విషయంలోకి వెళితే.. ఆయన మాటలు విన్న వెంటనే ఆగ్రహం కలగటం ఖాయం.

ఎందుకంటే.. ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ సభను నిర్వహించిన కన్నయ్య కుమార్ ను స్వాతంత్ర్య సమరంలో దేశం కోసం ప్రాణాలు అర్పించి భగత్ సింగ్ తో పోల్చటమే. అంతేకాదు.. జాతిపిత మహాత్మాగాంధీ.. బాల గంగాధర తిలక్.. లాంటి వారంతా దేశద్రోహం చట్టం కింద బాధితులుగా ఉన్న వారేనని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తిని పొగడటం కోసం మరీ ఇంతగా బరి తెగించాలా? అన్న సందేహం కలగక మానదు. రాజకీయాల కోసం జాతిపిత లాంటి వాళ్లను సైతం వాడేసుకోవటం చూసినప్పుడు బాధ కలుగుతుంది.

దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక విద్యార్థి నాయకుడ్ని జాతిపిత గాంధీ.. భగత్ సింగ్ లాంటి నేతలతో పోల్చటం చూసినప్పుడు కాంగ్రెస్ నేత దుర్మార్గం పతాక స్థాయికి చేరుకుందని చెప్పక తప్పదు. శశిథరూర్ మాటల్నే తీసుకున్నప్పుడు.. దేశంలో దేశద్రోహం కేసులు నమోదు అయ్యే ఉగ్రవాదులు సైతం.. గాంధీ.. భగత్ సింగ్ లతో పోల్చేయొచ్చా? నోటికి ఎంతమాట పడితే అంత మాటలు మాట్లాడే నేతల దూకుడుకు కళ్లాలు వేసేలా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న విషయాన్ని శశిథరూర్ లాంటోళ్లు స్పష్టం చేస్తున్నారని చెప్పక తప్పదు. ఇలాంటి వారిని చూసీచూడనట్లుగా వదిలేస్తే.. దేశ సమగ్రతకు నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.