Begin typing your search above and press return to search.

నాటి అఫ్జల్ ‘‘సెల్ ’’లోనే నేడు కన్నయ్య

By:  Tupaki Desk   |   18 Feb 2016 6:34 AM GMT
నాటి అఫ్జల్ ‘‘సెల్ ’’లోనే నేడు కన్నయ్య
X
కావాలని చేశారో.. అనుకోకుండా జరిగిపోయిందో కానీ చిత్రమైన పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఉగ్రవాది అఫ్జల్ గురుకు న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను అమలు చేసేందుకు అతడిని తీహార్ జైల్లోని మూడో నెంబరు సెల్ లో ఉంచారు. ఇప్పుడు అదే సెల్ ను.. అఫ్జల్ గురు వర్థంతి సందర్భంగా జేఎన్ యూ వర్సిటీలో నిర్వహించిన కన్నయ్య కుమార్ ను ఉంచటం గమనార్హం.

అఫ్జల్ కు బాహాటంగా మద్దతు పలకటంతో పాటు.. అతడి సంస్మరణ సభను నిర్వహించటం.. పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేయటంతోపాటు.. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కన్నయ్యపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేయటం.. కోర్టుకు హాజరుపర్చటం అతడికి జ్యూడిషియల్ రిమాండ్ కు ఆదేశిస్తూ పాటియాలా కోర్టు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

కోర్టు నిర్ణయంతో తీహార్ జైలుకు తీసుకొచ్చిన కన్నయ్య కుమార్ కు.. అఫ్జల్ గురు ఆఖరి రోజుల్లో గడిపిన సెల్ లోనే అతన్ని ఉంచటం గమనార్హం. అయితే.. అతగాడు సూసైడ్ చేసుకునే అవకాశం ఉందన్న ఆలోచనతో అతడి సెల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయటమే కాదు.. అతడి కదలికల మీద పూర్తి నిఘాను ఏర్పాటు చేయటం గమనార్హం. ఏది ఏమైనా.. అఫ్జల్ గురును ఉంచిన సెల్ లోనే కన్నయ్యను ఉంచటం సరికాదని కొందరు.. అదే తగిన శిక్ష అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కరుడు గట్టిన ఉగ్రవాదిని ఎంత సమర్థిస్తే మాత్రం కన్నయ్య కుమార్ ఉగ్రవాది కాదుకదా. అతగాడిని అఫ్జల్ ను ఉరితీసే సమయంలో ఉంచిన సెల్ లో ఉంచకుండా ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.