Begin typing your search above and press return to search.

కన్నయ్య సున్నాయే..

By:  Tupaki Desk   |   20 May 2016 7:57 AM GMT
కన్నయ్య సున్నాయే..
X
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ జెఎన్‌ యు విద్యార్ధి నేత కన్నయ్యకుమార్‌ను వామపక్ష - కాంగ్రెస్ పార్టీలు...బిజెపికి వ్యతిరేకంగా ప్రయోగించినా ఫలితం కనిపించలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలన్న కన్నయ్య పిలుపు ఫలించకపోగా, పశ్చిమ బెంగాల్‌ లో ఆయన ప్రచారం చేసిన వామపక్ష పార్టీలు ఘోర పరాజయం చవిచూశాయి. కన్నయ్య కేరళలో ప్రచారం చేసినప్పటికీ, ఆ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ కూటమి అధికార మార్పిడి జరుగుతుంటుంది కాబట్టి, ఆ సంప్రదాయంలో భాగంగా కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్ బదులు.. సీపీఎం సారథ్యంలోని ఎల్‌ డిఎఫ్ ఈసారి అధికారంలోకి వచ్చింది. అందులో కన్నయ్య ప్రచార ప్రభావమేమీ కనిపించలేదు. పైగా కన్నయ్య బిజెపికి ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా, గతంలో ఎప్పుడూ లేనంతగా పశ్చిమ బెంగాల్‌ లో 11.4 శాతం - కేరళలో 14.7 శాతం ఓట్లు రాకుండా అడ్డుకోలేకపోయారు.

అయితే..కన్నయ్యను తురుపుముక్కగా భావించి కాంగ్రెస్ - వామపక్షాలు ఆయనపై భారీ ఆశలు పెట్టుకున్నాయి. బీజేపీని ఆయన దెబ్బతీస్తాడని అంచనా వేశాయి. కానీ... కన్నయ్య ప్రచారం బీజేపీని ఏమీ చేయలేకపోయింది. గతంలో అసోంలో కేవలం 5 సీట్లతో 11.47 శాతం ఓట్లు సాధించిన బిజెపి, ఇప్పుడు 78 సీట్లతో 44.7 శాతం ఓట్లు సాధించింది. పశ్చిమబెంగాల్‌ లో గతంలో 19,34,650 ఓట్లతో 4.6శాతం ఓట్లు సాధించి ఒక్క సీటూ సాధించకపోయినప్పటికీ, ఈ ఎన్నికల్లో 11.04 శాతం ఓట్లతో 7 స్థానాలు గెలుచుకుంది. తమిళనాడులో గతంలో 8,19,577 ఓట్లతో 2.22 శాతం ఓట్లు సాధించగా, ఈసారి అది 2.04 శాతానికి తగ్గింది. పుదుచ్చేరిలో గతంలో 9,183 సీట్లతో ఒక్క సీటూ గెలవకున్నా 1.32 శాతం ఓట్లు సాధించగా, ఇప్పుడు 2.5 శాతం ఓట్లు సాధించింది. ఇక కేరళలో గతంలో ఒక్క సీటూ గెలవకపోయినా 10,53,654 ఓట్లతో 6.03 శాతం ఓట్లు సాధించగా, ఈసారి ఒక సీటుతోపాటు 14.7 శాతం ఓట్లు సాధించి తన ఉనికి చాటుకుంది. కేరళలో చాలా నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో కూడా నిలిచింది. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా ప్రయోగించిన కన్నయ్య అస్ర్టం ఏమాత్రం ఫలితం ఇవ్వలేదనే చెప్పాలి.

దీంతో రాజకీయ పార్టీలు ఇలా సడెన్ స్టార్ లు నమ్ముకోవడం వల్ల ఫలితం లేదని తేలింది. ఈ దెబ్బకు వామపక్షాలు - కాంగ్రెస్ లు కన్నయ్యకు దూరంగా జరిగితే ఆయన పొలిటికల్ హానీమూన్ పీరియడ్ ముగిసినట్లేనని చెప్పాలి.