Begin typing your search above and press return to search.

నిర‌స‌న గ‌ళంః మోడీయే దేశ‌మా?

By:  Tupaki Desk   |   8 Nov 2016 7:30 PM GMT
నిర‌స‌న గ‌ళంః మోడీయే దేశ‌మా?
X
జేఎన్‌ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చారు. జాతీ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారంటూ గ‌తంలో ఆయ‌న్ను పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాలు, దేశ‌వ్యాప్తంగా క‌న్హ‌య్య ప‌ర్య‌ట‌న అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఈ క్ర‌మంలో అస‌లేం జ‌రిగింద‌నేది తాను రాసిన బీహార్ టు తీహార్ పుస్త‌కంలో క‌న్న‌య్య కుమార్ వివ‌రించారు.

మొట్ట‌మొద‌టి తాను అరెస్టు అయిన‌పుడు పోలీసులు విచారించిన క్రమం గురించి, వారంటులేకుండానే అరెస్టు చేసి ప్రశ్నించిన తీరు గురించి పుస్తకంలో క‌న్హ‌య్య కుమార్‌ వివరించారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. “పోలీసులు ఠాణాలోని ఓ ఇరుకు గదిలోకి తీసుకుపోయారు. వెంటనే ప్రశ్నలు అడగడడం మొదలైంది. నన్ను స్టేషన్‌ కు తీసుకు వెళ్లిన వ్యక్తి మృదువుగానే మాట్లాడాడు. అయితే మరో పోలీసు విసురుగా వచ్చి - కరకుగా మాట్లాడాడు. ఇది నీ దేశం దీనికి వ్యతిరేకంగా నినాదాలకుదిగుతావా? అని అరిచినంత పనిచేశాడు. దీనితో నేను విస్తుపోయాను. దేశానికి వ్యతిరేకంగా నినాదాలకు ఎప్పుడు దిగాను? నేను మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన మాట వాస్తవమే ఇందులో దాపరికం లేదు.ఉన్నట్లుండి మోడీనే దేశంగా మారిపోయాడా? ఈ భావన కలుగగానే నాకు ఉన్నట్లుండి పరిస్థితి ఏదో తీవ్రంగానే ఉన్నట్లు తెలిసిపోయింది. నన్ను ఏ కారణంతో అరెస్టు చేశారు? అని అడిగాను. వారంటు ఉందా? అని నిలదీశాను. జైలులో వారంటు అందుకుంటారని కటువుగా సమాధానం వచ్చింది. అక్కడ అన్నీ తెలిసివస్తాయని చెప్పాడు. తరువాత ఆయన ఎవరి తోనే ఫోన్‌ లో మాట్లాడాడు. తరువాత నా తండ్రి ఫోన్ నెంబరు అడిగారు. నిజానికి నాకు ఫోన్ నెంబర్లు ఎక్కువగా గుర్తుండవు. చివరికి నా స్వంత నెంబరు కూడా. అయితే లక్కీగా పితాజీ నెంబరు గుర్తుకు వచ్చింది. చెప్పాను. తండ్రితో ఆ పోలీసు ఫోన్‌ లో మాట్లాడి, నన్ను దేశద్రోహం కేసులో అరెస్టు చేసినట్లు చెప్పాడు.

అప్పటికీ కానీ నాకు నాపై ఉన్న అభియోగం గురించి స్పష్టం కాలేదు. అయితే ఇదే సమయంలో నాకు ఈ ఆరోపణతో ఆందోళన కలిగింది. తొలిసారిగా భావోద్వేగానికి గురి అయ్యాను. కుటుంబం గురించి ఆలోచనలు తలెత్తాయి. నా ఆందోళనను గుర్తించి ఆ పోలీసు చివరికి ఎమైనా తిన్నావా? అని ప్రశ్నించాడు. తినలేదని చెప్పాను. ఏదైనా పెట్టండని ఎవరినో ఆదేశించారు. అయితే నేను తినడానికి నిరాకరించాను. నిరాహార దీక్షతో సమ్మెకు దిగుతున్నానని తెలిపాను. అయితే ఆయనలో ఎలాంటి చలనం కల్గినట్లుగా లేదు. తరువాత నన్ను కోర్టుకు తీసుకెళ్లారు. ఈ వ్యక్తి కన్హయ్య కుమార్ అని, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడని, అఫ్జల్ గురును కొనియాడాడని తెలిపారు. ఇదే ఈయనపై ఉన్న అభియోగం అని తెలిపారు. దర్యాప్తు అధికారి కలుగచేసుకుని తమ వద్ద దీనికి సంబంధించి వీడియో సాక్షం ఉందని చెప్పాడు. ఈ దశలో జడ్జి వీడియోను చూపాలని పోలీసులను ఆదేశించారు. అయితే ఈ వీడియోలో ఎక్కడా నేను లేను. వీడియో చూసిన తరువాత జడ్జి స్పందించారు. ఈ అబ్బాయి వీడియోలో ఎక్కడా నినాదాలకు దిగలేదు. అసలు వీడియోలో ఎక్కడా కన్పించ లేదే‘ అన్నారు” అని పుస్తకంలో కన్హయ్య తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/