Begin typing your search above and press return to search.

క‌న్న‌య్య‌కు జేఎన్‌ యూలోనే షాక్‌

By:  Tupaki Desk   |   6 March 2016 7:48 AM GMT
క‌న్న‌య్య‌కు జేఎన్‌ యూలోనే షాక్‌
X
కన్నయ్య కుమార్‌. ఢిల్లీ జేఎన్‌ యూ విద్యార్థి నాయకుడి ప‌దవి కోసం జ‌రిగిన పోటీలో నెగ్గిన‌పుడు వ‌చ్చిన పాపులారిటీ కంటే దాదాపు ల‌క్ష రెట్లు తాజా వివాదం ద్వారా ఆయ‌న‌కు ద‌క్కింది. దేశ‌విద్రోహ చ‌ర్య‌ల విష‌యంలో అరెస్టై తాత్కాలిక బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన క‌న్న‌య్య విడుద‌లైన అనంత‌రం జేఎన్‌ యూలో ప్ర‌సంగించారు. ఆయ‌న‌ ఉపన్యాసానికి ప్ర‌శంస‌లు ఎంత‌గా వ‌చ్చాయో...ప్రశ్న‌లు అంతే వ‌చ్చాయి. ఈ ప్ర‌శ్న‌లు కూడా ఆయ‌న ప్ర‌సంగం ఆధారంగా వ‌చ్చిన‌వే కావ‌డం ఆస‌క్తిక‌రం.

క‌న్న‌య్య త‌న ప్ర‌సంగంలో 2014 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి 32% ఓట్లే వచ్చాయని, 69% ప్రజలు వ్యతిరేకించారని చెప్పడాన్ని బీజేపీ అనుకూల వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం ప‌ట్ల త‌మ‌కేమీ అభ్యంత‌రం లేద‌ని అయితే అదే ఎన్నిక‌ల్లో దేశవ్యాప్తంగా లెఫ్ట్ కూట‌మికి కేవలం 4% శాతం ఓట్లే వచ్చిన విషయాన్ని ఆయ‌న‌ ఎందుకు దాచార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. లెఫ్ట్‌కు కేవ‌లం నాలుగు శాతం ఓట్లే వ‌చ్చాయంటే 96% ప్ర‌జ‌లు ఘోరంగా తిరస్కరించారనే విష‌యాన్ని క‌న్న‌య్య ఎందుకు ప్ర‌క‌టించలేద‌నే విష‌యాన్ని బీజేపీ అనుకూల వ‌ర్గాలు నిల‌దీస్తున్నాయి.

ఇంతేకాకుండా క‌న్న‌య్య జేఎన్‌ యూ విద్యార్థి సంఘం ఎన్నిక‌ల గురించి కూడా వారు ప్ర‌స్తావిస్తున్నారు. జేఎన్‌ యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో మొత్తం 7304 ఓట్లలో కన్నయ్య 1029 ఓట్లతో గెలిచాడు. అంటే 15% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన 85% విద్యార్థులు కన్నయ్యను తిరస్కరింనట్లే కదా.. మెజారిటీ విద్యార్థుల తిరస్కారానికి గురైన ఈ 28 ఏళ్ల పీహెచ్‌ డీ విద్యార్థి అబద్దాలు ఆడుతుంటే ఆహో ఓహో అంటూ భజనకు సిద్దమైన నాయకులు సిగ్గు పడాలని బీజేపీ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.